J.SURENDER KUMAR,
శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయం బోనాల ఉత్సవాల్లో (గోల్కొండ బోనాలు) పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. గురువారం నుంచి ఆషాడ మాస బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ , దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు తో పాటు ఆలయ ఈవో, పూజారులు, ధర్మకర్తల మండలి సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసి ఆహ్వానం అందించారు.
గోల్కొండ కోటపై శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారికి తొలి బోనం సమర్పణతో ఆషాఢమాస ఆధ్యాత్మిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతున్న ఈ పవిత్ర వేళ, ఆ జగన్మాత ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రార్థించారు.
👉 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక !

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ భక్తి, శక్తి, ఐక్యతకు చిరస్మరణీయ చిహ్నమని పేర్కొన్నారు. అమ్మవారిపై అచంచల విశ్వాసంతో సమర్పించే ప్రతి బోనం, ప్రతి ప్రార్థన ప్రజల జీవితాల్లో సిరిసంపదలు, సంతోషం, ధైర్యం, విజయాలను నింపాలని ఆకాంక్షించారు.

శ్రీ జగదాంబ మహంకాళి అమ్మ వారి అనుగ్రహం సకల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు..
