👉 సీట్ల కేటాయింపులో నిర్లక్ష్యానికి తావు లేదు !
👉 విద్యార్థుల తల్లిదండ్రులతో మర్యాదగా వ్యవహరించాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్!
J.SURENDER KUMAR
పేద, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ఒక్క విద్యార్థి కూడా గురుకుల విద్యకు దూరం కాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. గురుకుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పారదర్శకత, మానవీయ దృక్పథం, బాధ్యతాయుత వైఖరి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేస్తూ, నిర్లక్ష్యానికి లేదా అలసత్వానికి ఎలాంటి అవకాశం ఉండబోదని హెచ్చరించారు.
బుధవారం హైదరాబాద్‌లోని డీఎస్సీ భవన్‌లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో జరుగుతున్న సీట్ల కేటాయింపు ప్రక్రియ, ప్రజలకు అందుతున్న సేవలు, అధికారుల పనితీరును నేరుగా పరిశీలించారు. వివిధ జిల్లాల నుంచి తమ పిల్లలకు గురుకులాల్లో ప్రవేశాలు కల్పించాలని వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మంత్రి స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
👉 ప్రతి వినతిని ఓపికగా విన్న మంత్రి !

దూర ప్రాంతాలు, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రుల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించిన మంత్రి, ఒక్కొక్కరి సమస్యను శ్రద్ధగా విన్నారు. వారి కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల విద్యపై ఉన్న ఆశయాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర జిల్లాల్లో సీట్లు రావడం వల్ల రవాణా, వసతి, ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని పలువురు తల్లిదండ్రులు వివరించగా, సాధ్యమైనంత మేరకు విద్యార్థులకు సమీప జిల్లాల్లోనే సీట్లు కేటాయించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
👉 మానవీయ దృక్పథంతో పనిచేయాలి!
TGSWREIS జాయింట్ సెక్రటరీ (అడ్మినిస్ట్రేషన్) సక్రు నాయక్‌కు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. సీట్ల కేటాయింపులో పారదర్శకత, నిబంధనల అమలు, విద్యార్థుల సంక్షేమం ప్రధాన ప్రమాణాలుగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
👉 తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకూడదు!

మారుమూల గ్రామాల నుంచి కార్యాలయానికి వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకులు, బంధువులతో అధికారులు, సిబ్బంది అత్యంత మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. వారికి స్పష్టమైన సమాచారం అందిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యాలయాల్లో తిరగాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
👉 అధికారుల తీరుపై అసంతృప్తి !

ఈ సందర్భంగా అధికారుల పనితీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత, గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భారీగా నిధులు వెచ్చిస్తున్న సమయంలో, క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ లక్ష్యాలకు భంగం కలిగించేలా ఉండకూడదన్నారు. ప్రతి అధికారి ప్రభుత్వ సంక్షేమ లక్ష్యాలను తన వ్యక్తిగత బాధ్యతగా భావించి ప్రజల పట్ల సానుభూతితో పనిచేయాలని సూచించారు.
👉 దేశానికే ఆదర్శంగా గురుకుల విద్యా వ్యవస్థ !
రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, ఆధునిక మౌలిక వసతులు, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తూ వారి భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఆ లక్ష్యాల సాధనలో అధికారులు మరింత నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
👉 పేద విద్యార్థి చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు !.
అదే ప్రజా ప్రభుత్వ సంకల్పం. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించేలా అవసరమైన ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అధికారులు కూడా అదే నిబద్ధత, అదే మానవీయ దృక్పథంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలి” అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.
👉 మంత్రి చొరవను అభినందించిన తల్లిదండ్రులు!

గురుకులాల్లో ప్రవేశాల కోసం వచ్చిన తల్లిదండ్రులు తమ సమస్యలను మంత్రి స్వయంగా విని వెంటనే స్పందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు మంత్రి చూపుతున్న చొరవను వారు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
