👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
👉 ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు , ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ , పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
👉 భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూముల్లో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్కులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
👉 నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాలని, తారామతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు. మంజీరా, దిల్‌కుషా అతిథి గృహాలను అధునికీకరించాలని ఆదేశించారు.
👉 టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్‌ను అభివృద్ధి చేయాలని, ప్రధానంగా వికారాబాద్‌లోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. యాదగిరిగుట్ట తరహాలో దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
👉 క్యూర్ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికారులను నియమించి పనులను ముమ్మరం చేయాలని చెప్పారు.
👉 నగరంలో పురానాపూల్ వంటి వారసత్వ సంపదగా నిలిచిన బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి చేసిన తర్వాత అవసరమైతే ట్రాఫిక్‌ను మరో మార్గం నుంచి మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలని సూచించారు.
👉 పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి అధికారులను ఆరా తీసిన ముఖ్యమంత్రి వచ్చే డిసెంబర్‌లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మంట్ సమ్మిట్‌పై కసరత్తును ప్రారంభించాలని చెప్పారు. ఈ సమ్మిట్ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.
