👉 తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత !
J.SURENDER KUMAR,
ఈ సంవత్సరం ఏప్రిల్ 28నే ఎలక్షన్ కమిషన్ (ఈసీ)తమకు ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును కేటాయిస్తూ లేఖ ఇచ్చిందని, ఆ నమ్మకంతోనే తెలంగాణవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి, సంస్థాగత నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకున్నామని, ఇప్పుడు హఠాత్తుగా పేరు మార్చుకోవాలని చెబితే పార్టీగా తాము తీవ్రంగా నష్టపోతామని, అది తమకు ఎలక్షన్ కమిషన్ అన్యాయం చేయడమే అవుతుందని ‘తెలంగాణ రక్షణ సేన’వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు
తాము ప్రతిపాదించిన ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీకి తక్షణమే గుర్తింపు ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘాన్ని కి ( ఈ సి )విజ్ఞప్తి చేశారు. కేవలం ఊహాజనిత రూపాల ఆధారంగా వచ్చిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చాలని కవిత కోరారు.

ఈనెల 7న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అనిల్ కుమార్ ఆదివారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్లకు అధికారికంగా లేఖ రాశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 29A కింద తాము చేసుకున్న దరఖాస్తును నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా పరిశీలించి.. పూర్తి కారణాలతో కూడిన స్పష్టమైన ఆదేశాల ద్వారా ‘తెలంగాణ రక్షణ సేన’ పార్టీ గుర్తింపును ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు.
పార్టీ రిజిస్ట్రేషన్‌పై సుమారు వెయ్యి అభ్యంతరాలు వచ్చాయని జూన్ 23న ఈసీ తమకు లేఖ రాసిందని, కానీ అందులో ఒక్క కాపీని కూడా తమకు పంపలేదని లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు.
మా పార్టీపై అభ్యంతరాలు ఎవరు వ్యక్తం చేశారు? అందులో ఏముందో మాకు తెలియకుండా మేము ఎలా సమాధానం చెప్పగలం? మూడున్నర కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో కేవలం వెయ్యి మంది అభ్యంతరం తెలిపారనే సంఖ్యను చూపిస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవడం సరికాదు” అని లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం తాము ఈసీ ఎదుట వ్యక్తిగత విచారణకు హాజరయ్యే ముందే.. ఆ 1000 అభ్యంతరాల కాపీలను, తమకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను అందజేయాలని, వాటిని పరిశీలించడానికి తగిన సమయం ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరారు.
