విద్యాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం !

👉 సీఎం రేవంత్ రెడ్డి  చొరవతో ఐదు ఎకరాల విలువైన భూమి కేటాయింపు !

👉 జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో అందరి సమిష్టి కృషి ఫలించింది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంయుక్తంగా  భూమిపూజ నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ………

కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించిన భూమి గతంలో రైతులకు చెందినదని, భూమి కేటాయింపులో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, నిరంతర కృషితో రాష్ట్ర ప్రభుత్వం వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిందన్నారు. ఈ భూమి కేటాయింపునకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలని కోరారు.

విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, జగిత్యాల జిల్లా అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్  స్పష్టం చేశారు.

ధర్మపురి నియోజకవర్గానికి కూడా మరిన్ని విద్యాసంస్థలు తీసుకురావాలని ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కోరారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాల ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ విద్యా సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు.

👉 నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ,…

1983లో కేవలం 20 కేంద్రీయ విద్యాలయాలతో ప్రారంభమైన వ్యవస్థ ప్రస్తుతం దేశ, విదేశాలలో 1,289 కేంద్రీయ విద్యాలయాలకు విస్తరించిందన్నారు. ప్రస్తుతం 13,51,446 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 42,661 మంది బోధనా సిబ్బంది, సుమారు ఐదు వేల మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు.
తెలంగాణకు మొత్తం 39 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా, ప్రస్తుతం 37 పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు.

కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన, అందుబాటు విద్యకు ప్రతీకలని పేర్కొంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సైన్యం, వాయుసేన, నౌకాదళం, పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రాధాన్యతతో పాటు స్థానిక విద్యార్థులకు కూడా ప్రవేశాల్లో అవకాశం ఉంటుందని వివరించారు.

రష్యా, నేపాల్, ఇరాన్ వంటి దేశాల్లో కూడా కేంద్రీయ విద్యాలయాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ, ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి, సినీనటి ఐశ్వర్య రాయ్ తదితర ప్రముఖులు కేంద్రీయ విద్యాలయాల్లోనే చదువుకున్నారని గుర్తు చేశారు.


జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో సైనిక్ స్కూల్ ఏర్పాటుతో పాటు జగిత్యాలకు కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. మంచి స్థలంలో కేంద్రీయ విద్యాలయానికి ఐదు ఎకరాలు కేటాయించిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్రీయ విద్యాలయానికి మరో ఐదు ఎకరాల భూమి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

👉 ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.

కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ఎంపీ అరవింద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, భవిష్యత్తులో సైనిక్ స్కూల్‌ను కూడా మంజూరు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో సుమారు ₹.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి విద్యా సంస్కరణలను అమలు చేస్తోందన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయాలు సహజమే అయినప్పటికీ, మిగిలిన సమయంలో ప్రజల సంక్షేమం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ…..

ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతో జాతీయ రహదారి సమీపంలోని అత్యంత విలువైన ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ జిల్లాకు శాశ్వత ఆస్తిగా నిలుస్తుందన్నారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలోనే కేంద్రీయ విద్యాలయం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అనంతరం శాశ్వత ప్రిన్సిపాల్ నియామకం కూడా జరుగుతుందని తెలిపారు.

👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,...

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యేగా ఈ విద్యాసంస్థను తీసుకురావడానికి నిరంతరం కృషి చేశానని తెలిపారు.
జగిత్యాల పరిసర ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం తదితర విద్యాసంస్థలు ఒకే ప్రాంతంలో ఏర్పాటు కానున్నాయని చెప్పారు.

వాలంతరీ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహజ వ్యవసాయంపై మళ్లీ పరిశోధనలు ప్రారంభించి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

👉 చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,..

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎంపీ అరవింద్ చేసిన కృషి అభినందనీయమన్నారు. తెలంగాణను విద్యారంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ మోడల్ స్కూల్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి అనేక విద్యా కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం డైట్ ఛార్జీలు, ఇతర సౌకర్యాల వ్యయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా పెంచిందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.దినేష్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, చలగల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, జగిత్యాల ఆర్.డి.ఓ. మధుసూదన్ ఇతర ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.