పాలమూరు-ఎత్తిపోతల ప్రాజెక్ట్ శుభవార్త వింటారు !


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త వినబోతున్నట్టు ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి  చెప్పారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్‌లో స్థాపించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ (CQP) తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించి పరిశీలించారు.


👉  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి  మాట్లాడుతూ,

ఈ ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి అనుమతులు సాధించే దిశగా ముందుకు వెళుతున్నట్టు ప్రకటించారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులపైన కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

👉“కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న దిండి, పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, బీమా నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి, సమస్యలను పరిష్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం” అని చెప్పారు.

👉 “ఈ ప్రాజెక్టులకు సంపూర్ణమైన అనుమతులను సాధించి మహబూబ్‌నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసే బాధ్యత తీసుకుంటా. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే. నేను ఈ పాలమూరు జిల్లా వాడిగా అత్యంత వెనుకబడిన ఈ జిల్లాను అత్యంత అభివృద్ధి చెందిన ఆదర్శవంతమైన జిల్లాగా అభివృద్ధి చేసుకుందాం..” అని జిల్లా వాసులకు పిలుపునిచ్చారు.

👉 విద్య, నీటిపారుదల, పారిశ్రామాభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యతగా పరిగణించి పాలమూరు జిల్లాలో ట్రిపుల్ ఐటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రతి నియోజకవర్గానికి ఏటీసీలు తీసుకొచ్చినట్టు తెలిపారు.

👉 “పెట్టుబడులకు సంబంధించి గత ప్రభుత్వాలు అమలు చేసిన విధానాల్లో ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే వాటిని మార్చకుండా మరింత మెరుగుపరిచి పాలసీలను తెచ్చాం. పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను నిర్దేశించాం. టూరిజం, ఎనర్జీ, మెడికల్, స్పోర్ట్స్ పాలసీను తీసుకొచ్చాం. తెలంగాణ రైజింగ్ విజన్‌కు అమర రాజా సంస్థ మద్దతుగా నిలవాలి..” అని కోరారు.

👉 “పారిశ్రామికంగా అభివృద్ధి సాధించడానికి పాలమూరు జిల్లాలో చాలా మంది రైతులు భూములు ఇచ్చారు. పరిశ్రమలు అత్యధిక ఉద్యోగాలు ఈ ప్రాంతం వారికే ఇవ్వాలి. చిన్న సహాయాన్ని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే ఇక్కడ ప్రజలను అక్కున చేర్చుకోవాలి..” అని కోరారు.

👉 “వాతావరణంలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. ఎల్‌నినో కారణంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యాన్ని తగ్గించుకుని కాలుష్య రహిత దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దాలంటే వాహన కాలుష్యాన్ని నియంత్రించాలి. అందుకు ఈవీ వాహనాలను వినియోగం పెరగాలి.

👉 ఈవీ బ్యాటరీలు ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో 32 గిగాబైట్ సామర్థ్యం కలిగిన యూనిట్ అమర రాజా స్థాపించడం సంతోషం. అమర రాజా సంస్థలో 700 ఉద్యోగుల్లో 400 మంది మహిళలు ఉండటం గర్వకారణం” అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

👉 “పాలమూరు జిల్లాలో నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేసి, స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్న అమర రాజా యాజమాన్యాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. 1983లో అమర రాజా యాజమన్యం చిత్తూరులో ప్రారంభించి, దాదాపు 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో బయట రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లాలో పెట్టడం మనకందరికీ గర్వకారణం.

👉 అమర రాజా సంస్థ ప్రపంచంతో పోటీపడే సంస్థ. లోకల్ టాలెంట్‌తో గ్లోబల్ సంస్థలతో పోటీ పడుతున్న అమర రాజా సంస్థతో పోటీ పడే సంస్థ ఈ దేశంలో ఏదీ లేదు. చైనా, జపాన్, జర్మనీతో.. కొన్ని అంశాల్లో సౌత్ కొరియాతో పోటీపడుతుంది. దేశాలనే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తోంది” అని అమర రాజా సంస్థను అభినందించారు.

👉 “ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా, ఈవీ బ్యాటరీలు, ఈవీ వాహనం కావాలన్నా, ఈవీకి సంబంధించిన ఏ ఉత్పత్తయినా చైనా మీద ఆధారపడుతుంది. చైనా లీడర్ ఆఫ్ ఈవీ ప్రొడక్ట్స్. అలాంటి దేశంతో పోటీపడటానికి ప్రయత్నం చేస్తున్న అమర రాజా యాజమాన్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది..” అని ముఖ్యమంత్రి  పేర్కొన్నారు.

👉 ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి, అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్ , ఎంపీ డీకే అరుణ , ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాస్ రెడ్డి , ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తోపాటు అధికారులు పాల్గొన్నారు.