👉 వ్యవసాయం, తాగునీరు, ఆరోగ్యం, సాగునీరు, విద్య, వాతావరణ పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో..
👉 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు !
J .SURENDER KUMAR,
రాష్ట్ర, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి సాధన దిశగా కార్యాచరణ చేపట్టి తెలంగాణ రాష్ట్రంను దేశంలోనే అగ్రగామిగా నిలపాలనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లకు సూచించారు.
వ్యవసాయం, తాగునీరు, ఆరోగ్యం, సాగునీరు, విద్య, వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐ.డీ.ఓ.సీ) నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ హరిణి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ,………

చిన్న జిల్లాలు ఉండడం వల్ల పరిపాలన మరింత సమర్థవంతంగా సాగుతుందని, చిన్న సమస్యలు కూడా అధికారుల దృష్టికి వస్తాయని తెలిపారు. చిన్న జిల్లాల్లో ఐ.ఏ.ఎస్. అధికారులు అద్భుత ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి శాఖకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు.
👉 ప్రతి జిల్లా రాష్ట్ర, జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా తనదైన అజెండాతో ముందుకు సాగాలని అన్నారు. సమష్టి కృషితో వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని తెలిపారు. జిల్లాల్లో ఎదురయ్యే ఏ సమస్యనైనా ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
👉 వర్షపాతం పరిస్థితులను సమీక్షిస్తూ కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటివరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలో రెండు జిల్లాల్లో అధిక వర్షపాతం, 19 జిల్లాల్లో సాధారణ వర్షపాతం, 11 జిల్లాల్లో లోటు వర్షపాతం, ఒక జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైందన్నారు.
👉 రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా అందుతున్న నేపథ్యంలో రైతుల మొబైల్ నంబర్లు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, ప్రతి రైతుకు తెలుగు భాషలో వ్యవసాయ సూచనలు, వర్షపాతం వివరాలు, వాతావరణ హెచ్చరికలు ఎస్.ఎం.ఎస్.ల ద్వారా నిరంతరం పంపించాలని ఆదేశించారు.
👉 రైతులకు అవసరమైన యూరియా నిల్వలు రాష్ట్రంలో తగినంతగా ఉన్నాయని, ప్రతి రైతుకు అవసరమైన సమయంలో అవసరమైన పరిమాణంలో యూరియా అందేలా చూడాలని సూచించారు. యూరియా వృథా కాకుండా, అవసరానికి మించి వినియోగించకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటలు, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగును పెద్దఎత్తున ప్రోత్సహించాలని సూచించారు.
👉 ప్రభుత్వం బోనస్ అందిస్తున్న ఏడు రకాల సన్న వరి వంగడాల పై రైతులకు స్పష్టమైన సమాచారం చేరేలా చూడాలని, ఆయా వంగడాల విత్తనాలు ప్రతి మండలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
👉 వరి సాగు విస్తీర్ణాన్ని ప్రణాళికాబద్ధంగా తగ్గిస్తూ కూరగాయల సాగును ప్రోత్సహించాలని తెలిపారు. పట్టణాలు, నగరాలకు సమీపంలోని రైతులు కూరగాయల సాగు చేపట్టేలా ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందడంతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
👉 సీజనల్ వ్యాధుల నివారణకు జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలతో వెంటనే సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. యాంటీ లార్వా కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలని, ప్రతి శుక్రవారం అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో డ్రై డే కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.

👉 గురుకులాలు, హాస్టళ్లలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జిల్లాల్లో ప్రతిరోజూ సీజనల్ వ్యాధుల నివేదికలను సమీక్షిస్తూ అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల జాబితాను ముందుగానే సిద్ధం చేయాలని, వారిని ఆరోగ్య సిబ్బంది నిరంతరం ఫాలో అప్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
👉 ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నుంచి పట్టణాలు, నగరాలు, గ్రామాలకు బల్క్ తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.
👉 పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు సమన్వయంతో ప్రతి ఇంటికి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని, పైప్ లైన్ లీకేజీ లను వెంటనే నివారించాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో నీరు అత్యంత విలువైనదని, ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టం కొనసాగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
👉 రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన వీ.బీ.జీ.ఆర్.ఏఎం.జీ. (VBGRAMG) పథకాన్ని అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో చేపట్టే తాగునీటి పనులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యాశాఖలో మధ్యాహ్న భోజన పథకం, అల్పాహార పథకాలను నాణ్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఈ కార్యక్రమంపై మంత్రివర్గం సమగ్ర సమీక్ష నిర్వహించిందని, ప్రస్తుతం ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలలో భాగమయ్యారని తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం, అల్పాహారం తీసుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, దీంతో నాణ్యత నియంత్రణ మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
