👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
అమెరికా సంయుక్త రాష్ట్రాల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అక్కడి ప్రజలకు, ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
👉 తెలంగాణకు చెందిన వైద్యులు, ఇంజినీర్లు, ఐటీ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభ, కృషి, అంకితభావంతో అమెరికా అభివృద్ధిలో విశేష పాత్ర పోషిస్తూ మన రాష్ట్రానికి గర్వకారణంగా నిలుస్తున్నారని ఒక సందేశంలో అన్నారు.
👉 “ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను చాటుతూ తెలంగాణ పేరును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న ప్రతి తెలుగు బిడ్డకు అభినందనలు. అమెరికాలోని తెలంగాణ సమాజం కేవలం వృత్తిపరమైన విజయాలకే పరిమితం కాకుండా, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే వారధిగా నిలుస్తోంది. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ తెలంగాణ ఆత్మను ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
👉 తెలంగాణ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలంగాణవారితో సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉందని, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ఎల్లప్పుడూ స్వాగతిస్తామని స్పష్టం చేశారు.
👉 అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం మరింత స్నేహం, శాంతి, సమృద్ధి, పరస్పర సహకారానికి దోహదపడాలని ఒక సందేశంలో ఆకాంక్షించారు.
