👉 ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి.!
👉 సామాజిక న్యాయంపై నా సంకల్పం మరింత పెరిగింది !
J.SURENDER KUMAR,
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక న్యాయ యోధుడు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో ముడిపడిన చారిత్రక ప్రదేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. లండన్‌లోని ప్రసిద్ధ అంబేద్కర్ హౌస్‌ను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సీఎం దర్శించుకున్నారు.
1921–22 కాలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లండన్‌లోని ప్రిమ్‌రోజ్ ప్రాంతంలో 10 కింగ్ హెన్రీ’స్ రోడ్లో నివసించారు. ఆయన నివసించిన ఈ చారిత్రక భవనాన్ని ప్రస్తుతం అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలకు అంకితమైన మ్యూజియంగా తీర్చిదిద్దారు. రాజ్యాంగబద్ధత, సమానత్వం, కులరహిత సమాజం, అణచివేత లేని సమాజం, సామాజిక న్యాయం వంటి అంబేద్కర్ మహనీయ ఆశయాలను ఈ మ్యూజియం ప్రతిబింబిస్తోంది.

👉 “జీవితకాలపు స్ఫూర్తిని అందించింది” !
అంబేద్కర్ హౌస్ సందర్శన తనకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “మహనీయులు డాక్టర్ అంబేద్కర్ హౌస్‌ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిది. ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుంది. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న నా ఆకాంక్ష మరింత పెరిగింది” అని సందర్శకుల డైరీలో రాశారు.
దాదాపు గంటపాటు సాగిన పర్యటనలో అంబేద్కర్ మ్యూజియం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ అలయన్స్ (ACDA) చైర్ సంతోష్ దాస్ MBE, యూకేలో బాబాసాహెబ్ జీవితానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.
👉“నా జీవితంలో గొప్ప క్షణాల్లో ఒకటి”!

పర్యటన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవితానికి సంబంధించిన వ్యక్తిగత అంశాలను తెలుసుకోవడం, ఆయనతో ముడిపడిన వస్తువులను చూడటం, తాకగలగడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందన్నారు.

నా జీవితంలో ఇది గొప్ప క్షణాల్లో ఒకటి. భారతీయుల్లో గొప్ప వ్యక్తుల్లో ఒకరైన బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితంలోని వ్యక్తిగత కోణాన్ని చూసి, ఆయనతో ముడిపడిన వస్తువులను తాకగలగడం ఎంతో గొప్ప అనుభూతి” అని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లో సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువలను కాపాడాలనే సంకల్పానికి ఈ పర్యటన మరింత స్ఫూర్తినిచ్చిందని సీఎం వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
