రైజింగ్ ప్రతినిధి బృందం తో కేంబ్రిడ్జ్ విద్యావేత్తలు భేటీ!


👉 సీఎం రేవంత్‌రెడ్డి  నేతృత్వంలో విస్తృత చర్చ !


J.SURENDER KUMAR,


తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి  నేతృత్వంలోని ఈ బృందం తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది.


👉 సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు , సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్  పాల్గొన్నారు.


👉 హైదరాబాద్‌లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను ఆహ్వానించారు.


👉 కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు , వెంకట సిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అవకాశాలపై సానుకూలంగా స్పందించారు.


👉 హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తల ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి.


👉 కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ రైజింగ్ లక్ష్యానికి ఇది మరింత బలం చేకూర్చనుంది.

👉 సీఎంను కలిసిన లివర్‌పూల్ ప్రతినిధి బృందం !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లండన్‌లో లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్ విభాగానికి చెందిన సుసాన్ ఫిన్నెగాన్ , నూలా గల్లాఘర్‌ , లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్‌కు చెందిన పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు.

లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి చూపింది. ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేయడానికి లివర్‌పూల్ ప్రతినిధి బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌ను సందర్శించనుంది.