చిన్నారుల మృతి పై చలించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 “బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది… బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు !

👉 ఎక్స్‌గ్రేషియా, ఇల్లు, ఉద్యోగంతో పాటు సమగ్ర విచారణకు హామీ !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని షెడ్యూల్డ్ కాస్ట్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు చిన్నారులు ( ఐదో తరగతి విద్యార్థులు ) పంట పొలంలోని నీటి గుంతలో మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది అని బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధతో అన్నారు.

భవిష్యత్తు కోసం ఇంటి నుంచి హాస్టల్‌ ఉంటున్న చిన్నారులు అకాల మరణం చెందడం బాధిత రెండు కుటుంబాల్లోనే కాదు, సమాజంలోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇతర రాష్ట్ర పర్యటనలో ఉండటంతో వెంటనే బాధిత కుటుంబాల వద్దకు చేరుకోలేకపోయానని పేర్కొంటూ, “ఈ విషాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇది జరగకూడని ఘటన. కుటుంబాలకు కలిగిన లోటును ఏదీ భర్తీ చేయలేం” అని మంత్రిఆవేదన వ్యక్తం చేశారు.

👉 మంత్రి మాట్లాడుతూ……..

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, హాస్టల్ నుంచి విద్యార్థులు ఎలా బయటకు వెళ్లారు, పర్యవేక్షణలో ఎక్కడ లోపం జరిగిందో పూర్తిగా వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


👉 బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. జగన్నాథ్ సుశాంత్ కుటుంబానికి ₹ 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, 2BHK డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, అర్హత ఉన్న కుటుంబ సభ్యుడికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిపారు.

👉 వనం విష్ణు కుటుంబానికి కూడా ₹ 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.


నేను రాష్ట్రానికి చేరుకున్న వెంటనే బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తాను. ప్రభుత్వం తరఫున వారికి అందాల్సిన ప్రతి సహాయాన్ని అందించి, న్యాయం జరిగేలా కృషి చేస్తాను” అని మంత్రి భరోసా ఇచ్చారు.

👉 విద్యార్థుల మృతి అత్యంత విషాదకరం !

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ & జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !

మల్యాల మండలంలోని ఎంపీపీఎస్ ఒడ్డెర కాలనీ పాఠశాలలో చదువుతూ సమీకృత బాలుర వసతి గృహంలో ఉంటున్న ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందడం అత్యంత విషాదకరమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.

సోమవారం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ,మృత విద్యార్థుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఘటనపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.