👉 పూర్ణకుంభం వద్దు. మంగళ వాయిద్యాలకు నో సామాన్య భక్తుడిలా దర్శించుకున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !
👉 ఆదేశాలను అక్షరాలా అమలు చేసిన ధర్మపురి ఆలయ అధికారులు !
J.SURENDER KUMAR,
రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆదివారం ఆలయానికి వచ్చినప్పటికీ ఎలాంటి పూర్ణకుంభ స్వాగతం, మంగళ వాయిద్యాలు, పూలదండల హడావిడి కనిపించలేదు. సాధారణ భక్తుల మాదిరిగానే ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరిగి వెళ్లారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. “నేను మంత్రి హోదాలో కాదు… స్వామివారి భక్తుడిగా వస్తున్నాను. నాకు ప్రత్యేక స్వాగతాలు అవసరం లేదు” అని ఆలయ అధికారులకు మంత్రి ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా ఆదేశించారు.
ప్రజా జీవితంలో హోదా కంటే వినయం గొప్పదని, దేవుడి ముందు అందరూ సమానమేనని మంత్రి లక్ష్మణ్ కుమార్ మరోసారి తన ఆచరణతో నిరూపించారు గతంలో మంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను ఆలయ అధికారులు పూర్తిగా అమలు చేశారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ తన అనుచరులతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామివారిని, సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈశాన్య గణపతిని సామాన్య భక్తుడిలా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ భక్తుడిగా దర్శనం చేసుకోవడం ఆలయానికి వచ్చిన భక్తులను ఆకట్టుకుంది.
👉 ఆదేశాలను అమలు చేసిన అధికారులు !

మంత్రి ఆలయానికి వస్తున్న సమాచారంతో పోలీసులు ముందుగానే ఆలయ అధికారులను అప్రమత్తం చేశారు. సాంప్రదాయ ప్రకారం మంగళ వాయిద్యాలు, పూలమాలలు, వేద పండితులతో పూర్ణకుంభ స్వాగతానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే, గత నెల 13న మంత్రి ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను గుర్తుచేసిన ఆలయ సూపరింటెండెంట్ అలువాల శ్రీనివాస్, మంత్రి ఆదేశాల మేరకు ఎలాంటి ప్రత్యేక స్వాగతం ఉండదని సిబ్బందికి సూచించారు. దీంతో ప్రోటోకాల్ హడావిడి లేకుండానే దర్శన కార్యక్రమం జరిగింది..
👉“ఇది చివరి హెచ్చరిక”… జూలై 13న మంత్రి ఆగ్రహం !

గత నెల 13న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం అనంతరం మంత్రి ఆలయానికి వచ్చిన సమయంలో, సాంప్రదాయ ప్రకారం మంగళ వాయిద్యాలు, పూలదండలతో స్వాగతం పలికారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్‌ను మంత్రి పిలిచి, “ఇది మూడోసారి చెబుతున్నాను. ఇకపై నాకు ఇలాంటి స్వాగతం పలికితే చర్యలు తీసుకుంటాను” అని హెచ్చరించారు.

“నేను ఈ ప్రాంతానికి చెందిన వాడిని… స్వామివారి భక్తుడిని… ఆయన అనుగ్రహంతోనే ఎమ్మెల్యే, మంత్రి అయ్యాను. దర్శనానికి వచ్చిన ప్రతిసారి అధికార హోదాతో ఆర్భాట స్వాగతాలు అవసరం లేదు. దేవుడి ముందు అందరూ సమానమే” అని ఆరోజు మంత్రి స్పష్టం చేశారు. వెంటనే ఆలయ అధికారులు భాజాభజంత్రీలను వెనక్కి పంపించి మంత్రి సూచనలను అమలు చేశారు
👉 నిరాడంబరత !

ప్రస్తుతం కొంతమంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ,ఇతర కార్యక్రమాలలో, ఆలయ దర్శనాలను ప్రోటోకాల్ ప్రచార కార్యక్రమాలుగా మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్న తరుణంలో, మంత్రి లక్ష్మణ్ కుమార్ వ్యవహరించిన తీరు భిన్నమైన సందేశాన్ని ఇచ్చింది. పదవి అనేది ప్రత్యేక హక్కుల కోసం కాదు, ప్రజలకు ఆదర్శంగా ఉండేందుకేనని ఆయన ఆచరణ స్పష్టం చేసింది. భక్తి ముందు హోదా కాదని, వినయమే నిజమైన అలంకారమని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది.
