కరెన్సీపై అంబేద్కర్‌ చిత్రం జాతీయ స్థాయి చర్చ !

👉 మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌తో వేడెక్కిన చర్చ !


👉 ఇప్పటికే పార్లమెంట్‌, ఢిల్లీ వేదికలపై పలుమార్లు ప్రతిధ్వనించిన అంశం !

J.SURENDER KUMAR,


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రాన్ని భారత కరెన్సీ నోట్లపై ముద్రించాలన్న డిమాండ్‌ మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఢిల్లీలో  ఈనెల 7న నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంపై సిఫారసు చేయిస్తానని ప్రకటించడం చర్చకు మరింత రాజకీయ ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

ఈ నెల 7న న్యూఢిల్లీలో కరెన్సీ పై అంబేద్కర్ చిత్రం ముద్రించాలని మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్, ప్రొఫెసర్ ఖాసీం ( ఫైల్ ఫోటో)

మంత్రి ప్రకటన తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల సోషల్‌ మీడియా, ప్రాంతీయ మీడియా వేదికల్లో ఈ అంశంపై విస్తృత చర్చ మొదలైంది. కరెన్సీ నోటుపై ఎవరి చిత్రం ఉండాలి? దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయులకు కరెన్సీపై స్థానం కల్పించాలా? ప్రస్తుతం ఉన్న కరెన్సీ డిజైన్‌ విధానాన్ని కొనసాగించాలా? అంటూ చర్చ మొదలయింది.

👉  తెలంగాణ నుంచి జాతీయ వేదికకు…

అంబేద్కర్‌ చిత్రాన్ని కరెన్సీపై ముద్రించాలన్న డిమాండ్‌ కొత్తది కాదు. అయితే తెలంగాణ నుంచి ఇటీవలి కాలంలో ఈ అంశంపై వరుసగా జరుగుతున్న కార్యక్రమాలు దీనికి మరోసారి ఊపునిచ్చాయి. 2025లో ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద ఈ డిమాండ్‌పై కార్యక్రమాలు నిర్వహించగా, తెలంగాణలోనూ పోస్ట్‌కార్డు ఉద్యమాలు చేపట్టినట్లు వార్తలు.

సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న అంశం ( ఫైల్ ఫోటో)

👉 2026 మార్చిలో ఈ అంశం మరోసారి ఢిల్లీ రాజకీయ వేదికపైకి వచ్చింది. జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన మహాధర్నాలో పలువురు తెలుగు ఎంపీలు పాల్గొని, అంబేద్కర్‌ చిత్రాన్ని కరెన్సీ నోట్లపై ముద్రించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని కూడా ఎంపీలు వెల్లడించారు.

👉 లోక్‌సభ Rule 377 జాబితాలో డా. మల్లు రవి.. దేశ నిర్మాణంలో అంబేద్కర్‌ చేసిన కృషికి గౌరవంగా కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని ముద్రించాల్సిన అవసరంపై అంశాన్ని ప్రస్తావించినట్లు పార్లమెంటరీ రికార్డులు వెల్లడిస్తున్నాయి.


👉 పార్లమెంట్‌లోనూ పాత డిమాండ్‌ !


అంబేద్కర్‌ చిత్రాన్ని కరెన్సీపై ముద్రించాలన్న డిమాండ్‌కు పార్లమెంటరీ చరిత్రలోనూ ఆనవాళ్లు ఉన్నాయి. 2022లో అప్పటి లోక్‌సభ చర్చలో అమలాపురం ఎంపీ  అంబేద్కర్‌ చిత్రాన్ని ఏదైనా కరెన్సీ డినామినేషన్‌పై ముద్రించాలని కోరారు. అంతకుముందు 2015లోనూ భవిష్యత్‌ భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ చిత్రం ఉండాలని లోక్‌సభలో డిమాండ్‌ నమోదైంది.


👉 మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు..

కరెన్సీ నోట్లపై అంబేద్కర్‌ చిత్రం ఉండాలన్న చర్చ మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ గతంలో వ్యక్తమైంది. 2022లో కరెన్సీపై మహాత్మా గాంధీతో పాటు అంబేద్కర్‌ చిత్రాన్ని ఉంచాలన్న డిమాండ్‌ కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ నుంచి వచ్చింది.
ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొనడం ఈ అంశానికి అంతర్రాష్ట్ర స్వరూపాన్ని తీసుకొస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన నాయకులు ఒకే డిమాండ్‌పై ఢిల్లీలో గొంతు కలపడం కూడా రాజకీయంగా గమనించదగ్గ పరిణామంగా మారింది.

ఢిల్లీలో జాతీయా మీడియాతో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ ( ఫైల్ ఫోటో)


👉 అంబేద్కర్‌–రూపాయి చర్చకు చారిత్రక నేపథ్యం
రూపాయి, భారత ఆర్థిక వ్యవస్థపై అంబేద్కర్‌ చేసిన ఆలోచనలు ఆయన రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ‘ది ప్రాబ్లమ్‌ ఆఫ్‌ ది రూపీ’ వంటి ఆయన ఆర్థిక రచనలు భారత కరెన్సీ, ద్రవ్య విధానం, కేంద్ర బ్యాంకింగ్‌పై జరిగిన చర్చల్లో ప్రస్తావించబడుతున్నాయి.

👉 తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చేసిన తాజా డిమాండ్‌తో ప్రారంభమైన ఈ చర్చ.. ఇప్పుడు తెలంగాణ పరిధిని దాటి పార్లమెంట్‌ నుంచి వివిధ రాష్ట్రాల రాజకీయ, సామాజిక వేదికల వరకు విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రం స్పందనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

👉 తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కేంద్రానికి సిఫారసు చేస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రధాని, కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తారా? తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి మరిన్ని రాజకీయ స్వరాలు వినిపిస్తాయా? పార్లమెంట్‌లో దీనిపై విస్తృత చర్చ జరుగుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.