👉 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ కి మంత్రివర్గం తీర్మానం !
👉 మంత్రివర్గ వివరాలు మీడియాకు వివరించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు జారీ చేసి 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో ఈరోజుకు మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా, వారందరి స్మార్ట్ రేషన్ కార్డులను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా రేషన్ కార్డుదారులకు జారీకి మంత్రివర్గం తీర్మానించిందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
👉 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల శుభ సందర్భంగా తెలంగాణలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మంత్రిమండలి సమావేశ వివరాలను వెల్లడించారు.
👉 గత ఏడాది నిర్వహించినట్లే, ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహించాలని తీర్మానించింది. ఈ సదస్సును డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు శ్రీధర్ బాబు , ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో సబ్ కమిటీతో పాటు సదస్సు నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశం భావించింది.
👉 ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో సదస్సు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికను ఆవిష్కరిస్తారు. ప్రధానంగా రాష్ట్రంలో డిఫెన్స్, ఏరో స్పేస్, ఫార్మా రంగాల్లో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా. సదస్సు నిర్వహిస్తారు.
👉 వానాకాలం పంటకు సంబంధించి ఏడు రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించి, ఆ ఏడు రకాల సాగును పెంచడానికి రైతులకు అవగాహన కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది.
👉 యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఈసారి గతంలో ఎన్నడూలేని విధంగా 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిన అంశంపై చర్చించింది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించాలని తీర్మానించింది.

👉 ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబట్టుకున్న నేపథ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు ₹ 2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి, ఈ వేలం (e-Auction) ద్వారా ధాన్యం విక్రయించాలని నిర్ణయించారు.
👉 రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తేవడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేస్తారు.
👉 కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో తొలి విడతగా 113 నియోజకవర్గాల్లో స్కూల్ కాంప్లెక్స్ లను నిర్మించగా, ఇప్పటివరకు 86 స్కూల్ కాంప్లెక్స్‌లకు అనుమతులు మంజూరయ్యాయి.
👉 కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించి, హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వాటిని ఈవీ లుగా మార్చేందుకు ₹ 200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
👉 ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా ₹ 1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.
👉 హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తు గడువును మంత్రిమండలి మరో 3 నెలలు పొడిగించింది. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
👉 మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-II పనుల కోసం ₹ 2,100 కోట్ల అంచనా వ్యయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు ఈ ఎత్తిపోతల నుంచి అందుతుంది.
👉 గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీలకు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
