👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
👉 నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీకి మౌలిక వసతుల కల్పనకు తొలి దశలో ₹32 కోట్లు !
👉 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు !
J.SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రం నియోజకవర్గ కేంద్రమైన ధర్మపురి ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, ధర్మపురిలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు.
శుక్రవారం జగిత్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సి.సి.ఎల్.ఏ. కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎం.డి. గౌతమ్, వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడ నరసింగరావు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో పెండింగ్ పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించేందుకు ₹ 72 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పాత, ప్రస్తుతం వినియోగంలో లేని ట్రాక్టర్ ఉన్న కారణంగా కొందరు అర్హులు నష్టపోతున్నారని తెలిపారు. అలాంటి అర్హులైన కుటుంబాలకు నిబంధనల్లో సడలింపు కల్పించాలని రెవెన్యూ మంత్రిని కోరారు.
మాల్యాల మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు ₹ 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు.
👉 భూ రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం !
భూ రీ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ భూములతో పాటు ఆబాది ఆస్తుల రీ సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు ప్రయోజనాలు పొందేందుకు అర్హత లేని వారికి, నకిలీ పాస్ పుస్తకాల ఆధారంగా ప్రయోజనాలు అందిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. భూ రీ సర్వే అనంతరం నిజమైన రైతుల హక్కులను పరిరక్షిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.
👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ,…..
నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ₹ 18 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. కాలనీలో ప్రాథమిక పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
జిల్లాలోని సుమారు 100 మంది సీనియర్ జర్నలిస్టుల కోసం జర్నలిస్టు కాలనీ ఏర్పాటు చేయాలని, బీర్ నూతన మండలానికి తహసీల్దార్ కార్యాలయం మంజూరు చేయాలని, రాయికల్ మున్సిపాలిటీకి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
👉 ఎమ్మెల్సీ ఎల్. రమణ మాట్లాడుతూ…...
పేదలకు గౌరవప్రదమైన ఇళ్లు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నూకలపల్లి 2బీహెచ్‌కే కాలనీలో 4,500 ఇళ్లు నిర్మించబడ్డాయని, అయితే ప్రస్తుతం సుమారు 50 శాతం ఇళ్లలో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు.
👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ……
జగిత్యాల జిల్లాలో మొత్తం 10,365 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,208 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 8,079 మంది లబ్ధిదారులకు ₹ 227 కోట్ల 32 లక్షలు విడుదల చేసినట్లు వెల్లడించారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4,710 ఇళ్లు పూర్తయ్యాయని, 4,386 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, మరో 324 మంది లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉందని తెలిపారు. జిల్లాలో మొత్తం 1,562 గుడిసెలను గుర్తించగా, 1,319 గుడిసెలను పరిశీలించి ధ్రువీకరించినట్లు కలెక్టర్ వివరించారు.
👉 చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ….
అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు.
👉 వెలమ సంక్షేమ సంఘం కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింగరావు మాట్లాడుతూ ….
పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను స్వాగతించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
👉 ఇద్దరు చిన్నారుల కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం !

కార్యక్రమం ముగింపులో చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. అనంతరం 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పట్టాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వం పల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు రాజ గౌడ్, జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్, జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, నరసింహారావు, జీవాకర్ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ నాగజ్యోతి, మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్, కోరుట్ల మున్సిపల్ చైర్మన్, రాయికల్ మున్సిపల్ చైర్మన్, ఆయా మండలాల ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
