దళిత వ్యతిరేక బీజేపీ నుంచి దళిత నేతలు బయటకు రావాలి!

👉 ఉత్తరాఖండ్ ఘటనపై మోదీ, అమిత్‌షా క్షమాపణ చెప్పాలి!

👉 బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ !

J.SURENDER KUMAR,

బీజేపీ దళిత వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని, ఆ పార్టీలోని దళిత నాయకులు బయటకు రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పిలుపునిచ్చారు. దళితులు, అట్టడుగు వర్గాలను అణచివేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పర్యటన అనంతరం సభా ప్రాంగణాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కరీంనగర్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.

👉 ఖర్గే బహిరంగ సభ అనంతరం సభా ప్రాంగణాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు గంగాజలంతో శుద్ధి చేయడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఖర్గే విషయంలో జరిగిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

👉 అంబేద్కర్‌పై వ్యాఖ్యలను గుర్తు చేసిన మంత్రి
అట్టడుగు వర్గాల విషయంలో బీజేపీ ప్రభుత్వ వైఖరి గతంలో అనేక సందర్భాల్లో స్పష్టమైందని లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌ను ఏకవచనంతో సంబోధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

👉 ఉత్తరాఖండ్ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

👉 సభా ప్రాంగణాన్ని శుద్ధి చేసిన ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించాలని కోరారు. బీజేపీలో ఉన్న దళిత నాయకులు పార్టీ వైఖరిని ప్రశ్నించి బయటకు రావాలని పిలుపునిచ్చారు.

👉 రేషన్ కార్డులపై రాజకీయ దుమారం !

రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ చిత్రాన్ని ముద్రించాలని బీజేపీ చేస్తున్న డిమాండ్‌పైనా మంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా భారీ మొత్తంలో జీఎస్టీ చెల్లిస్తోందని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అధిక మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, ఆ మేరకు కేంద్రం రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని, ఆంధ్రప్రదేశ్‌కు అధిక నిధులు మంజూరు చేస్తోందని ఆరోపించారు.

👉 హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి !

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ఘటన కోట్లాది మంది దళిత, బహుజనులను అవమానించినట్లుగా ఉందని అన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 70 లక్షల మంది దళితులను అవమానించినట్లుగా ఈ ఘటన ఉందని అన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.