దుబాయ్‌లో గల్ఫ్ కార్మికుడి అవయవదానం !

👉 మరణంలోనూ మానవత్వం – పలువురికి కొత్త జీవితం !

👉 ధర్మపురి వాసి రవి యాదవ్ కుటుంబం గొప్ప నిర్ణయం !

J.SURENDER KUMAR,

పొట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన ధర్మపురి వాసి తొట్ల రవి యాదవ్.. అనారోగ్యంతో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న మానవతా నిర్ణయం ఇప్పుడు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

రవి యాదవ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఆయన మరణం మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశంగా మారింది. అనారోగ్యానికి గురైన రవి యాదవ్‌ను దుబాయ్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్యం విషమించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు.

ఈనెల 15న రవి మృతి చెందినట్లు  వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని వైద్యులు దుబాయ్‌లోని ఆయన బంధువులకు, ధర్మపురిలోని కుటుంబ సభ్యులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు. అవయవదానం ప్రాధాన్యతను తెలియజేయడంతో కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు.

👉 మరణంలోనూ మహోన్నత సేవ !

రవి యాదవ్ కుటుంబం తీసుకున్న నిర్ణయం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. ఒక వ్యక్తి జీవితం ముగిసినప్పటికీ.. ఆయన అవయవాల ద్వారా మరికొందరికి జీవనావకాశం లభించనుండటం కుటుంబ సభ్యుల ఔదార్యాన్ని చాటుతోంది. విదేశీ గడ్డపై కన్నుమూసిన తమ కుటుంబ సభ్యుడి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించడం ద్వారా వారు సమాజానికి ఆదర్శంగా నిలిచారు.

👉 స్వగ్రామానికి మృతదేహం తరలింపు!

అవయవదానం అనంతరం రవి యాదవ్ మృతదేహాన్ని గౌరవంగా స్వగ్రామానికి తరలించేందుకు దుబాయ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ఖర్చులతో మృతదేహాన్ని స్వదేశానికి తరలించడంతో పాటు ఇద్దరు సహాయకుల విమాన ప్రయాణ ఖర్చులను కూడా భరించనుంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ధర్మపురి వరకు అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయనుంది.


బుధవారం రాత్రి సుమారు 9 గంటలకు కార్గో విమానంలో దుబాయ్ నుంచి బయలుదేరే మృతదేహం గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు సమాచారం. అనంతరం స్వగ్రామమైన ధర్మపురికి తరలించనున్నారు.

👉 గల్ఫ్‌లో ధర్మపురి వాసుల సేవాభావం !

రవి యాదవ్ కుటుంబానికి అండగా నిలుస్తూ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి దుబాయ్‌లోని ధర్మపురి మండలానికి చెందినవారు కృషి చేశారు. ఆయన బావమరిది, శ్రీనివాస్, ధర్మపురి పట్టణానికి చెందిన ఆకుల రాయ నర్సు, మృతదేహం ధర్మపురికి తేస్తున్నారు. వీరితోపాటు ఇతర జిల్లా వాసులు చేసిన కృషిని పలువురు అభినందిస్తున్నారు. విదేశీ గడ్డపై తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి కుటుంబానికి అండగా నిలిచిన వారి సేవాభావం ప్రశంసలు అందుకుంటోంది.

రవి యాదవ్ కు భార్య ముగ్గురు సంతానం, మరణం విషాదాన్ని మిగిల్చినా.. ఆయన కుటుంబం తీసుకున్న అవయవదాన నిర్ణయం మాత్రం మానవత్వానికి చిరునామాగా నిలిచింది. మరణంలోనూ మరికొందరి జీవితాలకు వెలుగునిచ్చే అవకాశం కల్పించిన ఈ కుటుంబం నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.