👉 విప్లవాల గడ్డలో వికసిస్తున్న ప్రగతి !
👉 నాడు తుపాకుల మోత.. నేడు విజయాల బాట !
👉 బీర్పూర్ యువతకు రాజ్యాంగబద్ధ జీవనమే మార్గం !
👉 సైన్యం నుంచి సాఫ్ట్‌వేర్ వరకు.. దేశ విదేశాల్లో రాణిస్తున్న యువత !
👉 బీర్పూర్ దేశ యువతకు ఆదర్శం !
J.SURENDER KUMAR,
సుమారు నాలుగు దశాబ్దాల క్రితం బీర్పూర్ గ్రామం పేరు వినిపిస్తేనే ప్రభుత్వ యంత్రాంగంలో ప్రకంపనలు, పోలీసు బలగాల కవాతు.. తుపాకుల మోత.. ప్రజా కోర్టుల పేరుతో శిక్షలు.. నక్సల్స్ కోసం ఇళ్లలో సాయుధ పోలీసుల గాలింపులు.. లాఠీ దెబ్బలతో గాయపడిన ప్రజలు.. భయాందోళనల మధ్య సాగిన జీవనం నాటి బీర్పూర్ పరిస్థితి.
మావోయిస్టు అగ్రనేత గణపతి స్వగ్రామంగా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన బీర్పూర్, అణగారిన వర్గాల ఆవేదన, ఆవేశానికి ఉద్యమ రూపం ఇచ్చిన ముప్పాల లక్ష్మణరావు @ గణపతి స్వగ్రామం కావడంతో బీర్పూర్‌కు అప్పట్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆయన ఆలోచనల ప్రభావంతో విప్లవోద్యమం దేశవ్యాప్తంగా బలంగా విస్తరించింది. ఇదే గడ్డపై పుట్టి పెరిగిన కొందరు యువకులు తుపాకులు పట్టి అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్రలు పోషించారు.

👉 ఇదే బీర్పూర్ గ్రామం ఇప్పుడు మరో సందేశాన్ని ఇస్తోంది. అదే చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన మార్గంలో నడుస్తున్న యువత ఆలోచన ఒకే గడ్డపై పుట్టిన వారందరి ఆలోచనలు ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. పరిస్థితులు, కాలం మారుతున్న కొద్దీ యువత ఆలోచనా విధానంలోనూ మార్పు రావచ్చు. బీర్పూర్ యువత అందుకు చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది.
👉 గడ్డ ఒకటే.. గమ్యం వేరు…..
‘లంకలో పుట్టిన వారందరూ రాక్షసులు కారు’ అన్న సామెతను గుర్తు చేసేలా.. ఒక ప్రాంతానికి ఉన్న చరిత్ర, అక్కడి వ్యక్తులతో ఉన్న అనుబంధం ఆధారంగా ఆ ప్రాంత యువతను అంచనా వేయలేం. బీర్పూర్‌కు ఒక చరిత్ర ఉంటే.. ఆ చరిత్రను మించి నేటి యువతకు తమదైన భవిష్యత్ ఉంది. యువత చదువులో, ఉద్యోగాల్లో, ప్రజాసేవలో, వివిధ వృత్తుల్లో రాణిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో ముందుకు సాగడం సమాజానికి సానుకూల సందేశాన్ని ఇస్తోంది.
👉 అదే బీర్పూర్‌లో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తుపాకుల స్థానంలో పుస్తకాలు, అజ్ఞాత జీవితం స్థానంలో ఉద్యోగాలు, భయాందోళనల స్థానంలో ప్రజాస్వామ్య వాతావరణం, ఇదీ నేటి బీర్పూర్ చిత్రం.

👉 ఒకే ఊరిలో, ఒకే వాతావరణంలో పుట్టి పెరిగిన నేటి తరం యువత రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని ఎంచుకుని వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటోంది. దేశ రక్షణ కోసం సైన్యంలో చేరిన వారు కొందరైతే.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖలో సేవలందిస్తున్న వారు మరికొందరు. ఉపాధ్యాయులు, వైద్యులు, ఉన్నతాధికారులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, విద్యావేత్తలుగా మరికొందరు ఎదిగారు.
👉 సరిహద్దుల్లో పహారా నుంచి….. సాఫ్ట్‌వేర్ వరకు..!
బీర్పూర్‌కు చెందిన సుమారు పది మంది భారత సైన్యంలో సేవలందిస్తున్నారు. మరో పది మంది కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. ఎస్పీ, డీఎస్పీ, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ స్థాయి వరకు ముగ్గురు అధికారులు ఎదిగారు. దాదాపు 15 మంది ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. దశాబ్ద కాలం క్రితమే
తెలంగాణ సచివాలయంలో ఒకరు, రైల్వే శాఖలో గ్రూప్ అధికారి ఒకరు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఒకరు, వ్యవసాయ విస్తరణ అధికారిగా ఒకరు, ప్రముఖ వైద్యులుగా ఇద్దరు తమ సేవలు అందిస్తున్నారు. సరిహద్దులు దాటి కూడా బీర్పూర్ యువత ప్రతిభ చాటుతోంది. అమెరికాలో సుమారు పది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా, మరికొందరు యూకే, ఆస్ట్రేలియాలో స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారు. పలువురు యువతీ యువకులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
👉 నెత్తుటి మరకల నుంచి శాంతి సౌరభాల వరకు..!

గతంలో బీర్పూర్‌ను వెంటాడిన హింస, ఉద్రిక్తతల జ్ఞాపకాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గ్రామంలో గ్రామీణ బ్యాంకు, పంచాయతీ భవనం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, అంగన్‌వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార బ్యాంకు, పోలీస్ స్టేషన్, మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం వంటి ప్రభుత్వ సంస్థలు ఏర్పడటం గ్రామీణ ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది.


👉 అభివృద్ధితో పాటు బీర్పూర్ ప్రకృతి సోయగాలకు కూడా ప్రసిద్ధి. కొండలు, దట్టమైన అడవుల మధ్య వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులను ఆకర్షిస్తోంది. సాగునీరు అందించే రోళ్లవాగు ప్రాజెక్టు, దేవుని చెరువు, ఊర చెరువు, జలబుగ్గలు, వాగులు, వంకలు, గొలుసుకట్టు చెరువులు, పచ్చని పంట పొలాలు గ్రామానికి ప్రత్యేక అందాన్ని తీసుకొస్తున్నాయి. పక్షుల కిలకిలారావాలు, వన్యప్రాణుల సంచారం బీర్పూర్ ప్రకృతి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
👉 తుపాకీ కాదు.. రాజ్యాంగమే ఆయుధం !
సమాజంలో మార్పు రావాలంటే హింస, విధ్వంసం మార్గం కాదని.. విద్య, ఉద్యోగం, ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలే సరైన మార్గమని యువత విశ్వసిస్తోంది. తమ భవిష్యత్తును చట్టబద్ధమైన మార్గంలో నిర్మించుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఆలోచన బీర్పూర్ యువతలో కనిపించడం అభినందనీయం.
👉 బీర్పూర్ – దేశ యువతకు ఓ సందేశం..

ప్రశ్నించే హక్కు ఉండాలి.. మార్పు కోరే ఆలోచన ఉండాలి.. కానీ ఆ మార్పు రాజ్యాంగ పరిధిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలన్నదే బీర్పూర్ యువత జీవన విధానం చెబుతున్న సందేశం. విప్లవోద్యమం వైపు కాకుండా.. వికసిత భారత్ వైపు బీర్పూర్ యువత అడుగులు…. ఇదే బీర్పూర్ లో మారుతున్న ముఖచిత్రం..
