విదేశ పర్యటనలో సాధించిన పురోగతి పై ….


👉 తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష !


J.SURENDER KUMAR,


హైదరాబాద్‌ను భారతదేశంలోనే తొలి, అతిపెద్ద గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్ధమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల యూకే, అమెరికా పర్యటనలో సాధించిన పురోగతిపై తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

👉 ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలను – విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలను – భాగస్వామ్యాలు, ఆఫ్‌షోర్ క్యాంపస్‌ల ద్వారా హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రభుత్వం అత్యంత అంకితభావంతో పనిచేయాలని ముఖ్యమంత్రి  చెప్పారు.


👉 తద్వారా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిపుణులు, ప్రభుత్వ అధికారులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, కోర్సులను అభ్యసించే అవకాశం కల్పించాలన్నారు.


👉 ముఖ్యమంత్రి  నేతృత్వంలో, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆగస్టు 19 నుంచి 29 వరకు యూకేలో, అలాగే అధికారుల బృందం అమెరికాలో పర్యటించింది. ఈ ప్రతినిధి బృందంలో డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థ, వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ శాంతికుమారి , ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్-ఆఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్  ఉన్నారు.


👉 ఈ పర్యటనలో భాగంగా నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, బోస్టన్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ లు భారత్‌లో తమ తొలి ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE), స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS) సంస్థలతో జరిగిన చర్చలు కూడా సానుకూలంగా సాగాయి.


👉 ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, కొత్త బోధనా విధానాలు, తరగతి గది పరస్పర చర్చా వేదికలు, అధ్యాపకుల భాగస్వామ్యాన్ని పరిశీలించేందుకు తమ ప్రతినిధి బృందాలను హైదరాబాద్‌ పర్యటించడానికి ఆయా సంస్థలు అంగీకరించాయి.


👉 డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్లో సీనియర్ ప్రభుత్వ, కార్పొరేట్ అధికారుల కోసం స్వల్పకాలిక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ అంగీకరించింది.


👉 ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), లండన్ బిజినెస్ స్కూల్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల ప్రతినిధులతో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం చర్చలు జరిపింది.


👉 తెలంగాణ రైజింగ్ బృందం అమెరికాలో నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ ప్రతినిధులతో చర్చలు జరిపింది. వీటి ఫలితంగా పలు ఒప్పందాలు కుదిరాయి. త్వరలో మరిన్ని ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.


👉 ఈ పర్యటన ఫలితాలు తెలంగాణ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయని సమావేశంలో ముఖ్యమంత్రి  అన్నారు.


👉 “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలతో ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు, లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ విజయవంతంగా కుదరడం ద్వారా పెద్ద ప్రోత్సాహం లభించింది.


👉 తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలతో ఈ విషయాన్ని పంచుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. తెలంగాణతో పాటు మొత్తం భారతదేశంలోని యువత, చిన్నారులకు అత్యుత్తమ విద్యా అవకాశాలను అందించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తాను” అని ముఖ్యమంత్రి  చెప్పారు.


👉 హైదరాబాద్‌కు రానున్న ప్రపంచస్థాయి విద్యాసంస్థలు తెలంగాణతో పాటు దేశంలోని యువత, చిన్నారులకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని వ్యాఖ్యానించారు. యువత ఈ విద్యాసంస్థలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని, ప్రపంచ స్థాయిలో పోటీపడగల నిపుణులుగా ఎదగడానికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, తెలంగాణ రైజింగ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని అభిలషించారు.


👉 డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ప్రపంచస్థాయి విద్యాసంస్థలు, క్రీడా సంస్థలు, తెలంగాణపై చూపే ప్రభావం వంటి అంశాలపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.