గిరిజన అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


గిరిజనుల విద్య, హక్కులు, సంస్కృతి పరిరక్షణకు రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది, గిరిజన సంక్షేమానికి ₹.18 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో బంజారాహిల్స్ లో ఆదివారం  నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి తో పాటు, ఎమ్మెల్యే మందుల సామేల్,
మాజీ ఎంపీ  రవీంద్ర నాయక్, TRICOR ఛైర్మన్  బెల్లయ్య నాయక్,  మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,  మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ  బలరాం నాయక్, MLC  శంకర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బీఎం సంతోష్  తదితర నాయకులు పాల్గొన్నారు

👉 గిరిజన హక్కులు, సంస్కృతి పరిరక్షణకు ప్రాధాన్యం!

గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ బీఎం సంతోష్ మాట్లాడుతూ, గిరిజనుల అటవీ హక్కుల పరిరక్షణ, విద్యాభివృద్ధి, గిరిజన సంస్కృతి–సంప్రదాయాల పరిరక్షణ, మహిళల గౌరవం, సాధికారత, ఆరోగ్యం, అభివృద్ధి వంటి అంశాలకు శాఖ ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తోందన్నారు. గిరిజనుల సాంప్రదాయ జ్ఞానం, జీవన విధానం, కళలు, భాషలు, ఆచారాలను భావితరాలకు అందించేందుకు TRI ఆధ్వర్యంలో సంస్కృతి పరిరక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

👉 రిజర్వేషన్లతో గిరిజనుల అభివృద్ధి !

మాజీ ఎంపీ  రవీంద్ర నాయక్ మాట్లాడుతూ, సమతల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో గిరిజన జనాభా ప్రాతిపదికన కనీసం ఒక శాసనసభ స్థానాన్ని కల్పించే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 2014కు పూర్వం ఉన్న గిరిజన ఏజెన్సీ ప్రాంతాల వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

👉 రాములు నాయక్ మాట్లాడుతూ,

మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ హయాంలో లంబాడీలకు కల్పించిన రిజర్వేషన్ల వల్ల ఆ సమాజం విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు తదితర రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు.

👉 సామేల్ మాట్లాడుతూ…..

గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనుల హక్కులు, ప్రయోజనాలను కాపాడేందుకు గిరిజనేతరుల అక్రమ ప్రవేశం, భూముల ఆక్రమణ వంటి అంశాలపై కఠినమైన నియంత్రణ అవసరమన్నారు.

👉 సంప్రదాయ మూలాలను కాపాడుకోవాలి!

TRICOR ఛైర్మన్ శ్రీ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ,…గిరిజన సమాజం వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు, కళలు, భాషలు, జీవన విధానాల మూలాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

👉 MLC  శంకర్ నాయక్ మాట్లాడుతూ,….

గిరిజన సమాజంలో విద్య ద్వారానే శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి గిరిజన కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

👉 శ్రీమతి సీతాలక్ష్మి మాట్లాడుతూ,….

ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఇతర పాఠశాలల్లో కూడా ఘనంగా నిర్వహించాలని సూచించారు. తద్వారా విద్యార్థులకు గిరిజన చరిత్ర, సంస్కృతి, వారసత్వంపై అవగాహన కల్పించవచ్చన్నారు. గిరిజన విద్యార్థులు స్పేస్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.

👉 ఏజెన్సీ ప్రాంతాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి !

మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ  బలరాం నాయక్ మాట్లాడుతూ, ఆదివాసీ దినోత్సవాన్ని ఒక కొత్త సంకల్పానికి ప్రారంభదినంగా భావించాలని అన్నారు. ఈ రోజునే వచ్చే ఏడాదికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని, దానిని విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గిరిజన ప్రాంతాల్లో అర్హులైన కుటుంబాలకు మరిన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

👉 తొమ్మిది మంది ప్రముఖులకు సన్మానం !

ఆదివాసీ సమాజం, గిరిజన సంక్షేమం, విద్య, సంస్కృతి, హక్కుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన తొమ్మిది మంది ప్రముఖులను ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు.

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, ఉద్యోగులు, వివిధ గిరిజన సమాజాల ప్రతినిధులు పాల్గొన్నారు.