👉 హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి తోపాటు
విద్య ప్రాధాన్యత కు ప్రభుత్వం కట్టుబడి ఉంది !
👉 గిరిజన సంక్షేమానికి ₹18 వేల కోట్లకు పైగా నిధులు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గిరిజన సమాజం చేసిన త్యాగాలను గుర్తిస్తూ వారి హక్కులు, ఆత్మగౌరవం, విద్య, ఉపాధి, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
👉 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు.
గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ₹18 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని వెల్లడించారు. విద్యకు పెద్దపీట.. భవిష్యత్తుకు బలమైన పునాది గిరిజన సమాజ అభివృద్ధిలో విద్య కీలకమని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
👉 గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం మరింత మెరుగుపడేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అందిస్తున్న డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచడంతో పాటు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి అన్నారు. త్వరలో విద్యార్థులకు మరింత నాణ్యమైన కాస్ట్యూమ్స్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
👉 పాఠశాల దాటి.. ఉన్నత విద్య వైపు !
గిరిజన విద్యార్థులు పాఠశాల విద్యతోనే ఆగిపోకుండా ఉన్నత విద్య, ఉన్నత చదువుల్లోనూ అత్యుత్తమంగా రాణించేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి తెలిపారు. గిరిజన విద్యార్థి చదువు మధ్యలో ఆగకుండా.. ఉన్నత విద్య వరకు ప్రభుత్వ అండ ఉండేలా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
👉 స్కాలర్‌షిప్ బకాయిలపై చర్యలు !
గిరిజన విద్యార్థులకు సంబంధించిన పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు చర్యలు తీసుకుంటామని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఇటీవల హామీ ఇచ్చినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. సంస్కృతి కాపాడితేనే సమాజం బలపడుతుంది
గిరిజనుల అభివృద్ధి కేవలం ఆర్థిక పురోగతికే పరిమితం కాకూడదని.. వారి స్వీయ గుర్తింపు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలు కూడా సమానంగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

గిరిజన సమాజ హక్కులను కాపాడుతూ, వారికి మెరుగైన విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో సమాన భాగస్వాములుగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన సందేశం ఒక్కటే గిరిజన సంక్షేమం అంటే సంక్షేమ పథకాల అమలు మాత్రమే కాదు.. వారి హక్కులకు రక్షణ, పిల్లలకు నాణ్యమైన విద్య, యువతకు అవకాశాలు, సమాజానికి ఆత్మగౌరవం, తరతరాలకు సంస్కృతి పరిరక్షణ. మంత్రి అన్నారు.
