👉 ప్రతి సోమవారం మండల కేంద్రంలోనే ఫిర్యాదుల స్వీకరణ !
👉 గ్రామీణ ప్రజలకు చేరువైన పాలన – జీఓ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం !
👉 అన్ని శాఖల అధికారులు ఒకే వేదికపై సమస్యల పరిష్కారానికి సిద్ధం !
👉 రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక పరిపాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టింది !
J.SURENDER KUMAR,
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాల చుట్టూ తిరిగే పరిస్థితికి చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పరిపాలనా సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇప్పుడు మండల స్థాయిలో అమలు చేస్తూ ప్రభుత్వం జీ. ఓ నెంబర్ 4 ద్వారా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
👉 కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలు సమర్పించే ప్రతి వినతిని ప్రత్యేక ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, ఫిర్యాదు సంఖ్యతో కూడిన రసీదు అందజేస్తారు, దీంతో ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
👉 వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్య, వైద్యం, సంక్షేమం, విద్యుత్, తాగునీరు, గృహనిర్మాణం, అటవీ, మున్సిపల్ తదితర శాఖల మండల స్థాయి అధికారులు ఒకే వేదికపై హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి, వెంటనే పరిష్కార చర్యలు ప్రారంభించాల్సి ఉంటుంది. శాఖల మధ్య సమన్వయం పెరగడంతో సమస్యల పరిష్కార ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

👉 ప్రజావాణి కార్యక్రమంలో దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలతో వచ్చిన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. అలాగే తాగునీరు, కూర్చునే సౌకర్యం, వీల్‌చైర్లు, హెల్ప్‌డెస్క్, కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాలను ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
👉 ప్రజావాణిని కేవలం వినతులు స్వీకరించే కార్యక్రమంగా కాకుండా, పారదర్శకత, జవాబుదారీతనం, సమయబద్ధ పరిష్కారం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిలను ఒకే డిజిటల్ పోర్టల్‌తో అనుసంధానం చేయడం ద్వారా ప్రతి ఫిర్యాదుపై నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుంది.
👉 పాలన ప్రజల వద్దకే వెళ్లాలనే ఆలోచనకు ఈ నిర్ణయం మరో అడుగు. జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గి, గ్రామీణ ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ప్రభుత్వంపై విశ్వాసం మరింత పెరిగే అవకాశముందని పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి.
