ప్రాణాలు తిరిగి రావు – కుటుంబాలు ఒంటరివి కావు !

👉 దుఃఖంలో తోడుగా నిలిచి భరోసా ఇచ్చిన మంత్రి !

👉 ప్రభుత్వ స్పందనకు ప్రతీకగా మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR

రాజకీయ నాయకత్వం అంటే కేవలం ప్రకటనలు చేయడం కాదు, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం కూడా,  ప్రజా ప్రతినిధి పాత్ర ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలతో ముగియదు. ప్రజల జీవితాల్లో విషాదం చోటు చేసుకున్నప్పుడు వారి పక్కన నిలబడి ధైర్యం చెప్పడంలోనే నిజమైన ప్రజాసేవ కనిపిస్తుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఇద్దరు చిన్నారి విద్యార్థులు  ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద ఘటనలో ప్రభుత్వ మానవీయ స్పందనకు ప్రతీకగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  వ్యవహరించిన తీరు ఇది.


అభం శుభం తెలియని చిన్నారులు దురదృష్టవశాత్తు మృతి చెందడం అత్యంత హృదయ విదారకమని పేర్కొన్న మంత్రి, ఆ తల్లిదండ్రుల గర్భశోకాన్ని ఎవరూ తీర్చలేరని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని, బాధిత కుటుంబాలు ఒంటరివి కావని భరోసా ఇవ్వడం ద్వారా  మంత్రి మానవీయ కోణం లో  ప్రవర్తించారు.

ఇతర రాష్ట్ర పర్యటనలో ఉన్నప్పటికీ, ఘటన జరిగిన క్షణం నుంచి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు జిల్లా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రతి ఏర్పాటును పర్యవేక్షించడం మంత్రి బాధ్యతాయుత వైఖరికి నిదర్శనంగా నిలిచింది. 


తక్షణ సహాయంగా ₹.25 వేల నగదు, మృతదేహాల తరలింపునకు అంబులెన్స్ ఏర్పాటు, అనంతరం ఒక్కో కుటుంబానికి ₹.5 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలోని ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించే హామీ ఇవ్వడం కేవలం పరామర్శకే పరిమితం కాకుండా బాధిత కుటుంబాలకు ఆచరణాత్మక భరోసాను చూపించింది.