జగిత్యాల పోలీసులకు ‘ఐఫోన్’ సవాల్…!

👉 వేలాది ఫోన్లు రికవరీ చేస్తున్నా.. ఆ యువకుడి ఫోన్ ఆచూకీ ఏదీ ?

👉 రామగుండం కమిషనరేట్ పరిధిలోనూ ఇదే ప్రశ్న.. ‘ఆ ఫోన్ ఎక్కడ ?

👉 కొడుకు చివరి జ్ఞాపకాల కోసం తల్లి ఎదురుచూపులు.. పోలీసులపై ఆశలు !

👉 ₹1.75 లక్షల ఫోన్ కాదు.. తల్లికి కొడుకుతో మిగిలిన చివరి జ్ఞాపకం !


J.SURENDER KUMAR,


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరాలను ఛేదిస్తున్న పోలీసులు.. అడవుల్లో దాక్కున్న నేరస్తులను పట్టుకుంటున్నారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన వేలాది సెల్‌ఫోన్లను సైతం గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. కానీ.. ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి సెల్‌ఫోన్ మాత్రం పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఇది కేవలం ₹1.75 లక్షల విలువైన ఐఫోన్ వ్యవహారం కాదు.. ఓ తల్లికి తన కొడుకు చివరి జ్ఞాపకాలను తిరిగి అందించే ప్రశ్న……

👉 ఆ తల్లి ఎదురుచూపులు !

ధర్మపురి పట్టణ శివారులో ఏప్రిల్ మొదటి వారంలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముక్కుపచ్చలారని ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు. ప్రమాదానికి ముందు ద్విచక్రవాహనంపై వెళ్తూ వారు సరదాగా సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. ముగ్గురి వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లలో రెండు ఫోన్లు సంఘటనా స్థలంలో లభించి కుటుంబ సభ్యులకు అప్పగించినప్పటికీ.. సుమారు ₹ 1.75 లక్షల విలువైన ఐఫోన్ మాత్రం కనిపించకుండా పోయింది.

సెల్ ఫోన్ గల్లంతు అయింది అంటూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుడి కుటుంబ సభ్యులు ఏప్రిల్ 6న ఆన్లైన్లో చేసిన ఫిర్యాదు పత్రం ( ఫైల్ ఫోటో)

ప్రమాద విషాదం నుంచి కుటుంబ సభ్యులు కొంత తేరుకున్న తర్వాత.. కొడుకుకు ఇటీవలే కొనిచ్చిన ఆ ఐఫోన్‌లో ప్రమాదానికి ముందు స్నేహితులు తీసుకున్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయేమోనని ఆరా తీయడంతో ఫోన్ కనిపించకుండా పోయిన విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు సైతం ఫిర్యాదు చేశారు.

👉 సిగ్నల్స్ వచ్చినా.. ఆచూకీ ఎందుకు లేదు ?

ఆ ఫోన్‌కు సంబంధించి ఏప్రిల్‌లో రాయపట్నం, మంచిర్యాల ప్రాంతాల నుంచి సిగ్నల్స్ వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ ఇంతకాలం గడిచినా ఫోన్ ఆచూకీ లభించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.


ఫోన్ యాక్టివ్ అయి ఉంటే.. ఏ ప్రాంతంలో సిగ్నల్ వచ్చింది ? ఏ సెల్‌టవర్ పరిధిలో ఫోన్ పనిచేసింది ? ప్రస్తుతం ఫోన్ ఎక్కడ ఉంది ? అనే అంశాలను సాంకేతికంగా గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఆ ఫోన్ ఎందుకు లభించలేదన్నదే కుటుంబ సభ్యుల ప్రశ్న.

👉 ₹.4.50 కోట్ల ఫోన్లు రికవరీ చేసిన పోలీసులకు ఇదో ప్రశ్న!

జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ఆగస్టు 19న మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాధితులకు సెల్ ఫోన్లు అప్పగించిన చిత్రం ( ఫైల్ ఫోటో)

ఇటీవల జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో పోగొట్టుకున్న, చోరీకి గురైన ₹ 21 లక్షల విలువైన 102 సెల్‌ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సీఈఐఆర్‌ పోర్టల్ ద్వారా ఫోన్ వివరాలను నమోదు చేస్తే రికవరీకి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

సెల్‌ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, గత రెండేళ్లలో ₹.4.50 కోట్ల విలువైన ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ వెల్లడించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 25న సెల్ఫోన్ బాధితులకు రికవరీ ఫోన్లు అప్పగిస్తున్న కమిషనర్ అంబర్జు కిషోర్ (ఫైల్ ఫోటో)

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనూ సీఈఐఆర్‌ పోర్టల్ ద్వారా నమోదైన ఫిర్యాదుల్లో 3,717 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. మరో 142 ఫోన్లను సీసీఎస్‌, ఐటీ సెల్‌ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

👉 అయితే.. ఈ ఫోన్ ఎందుకు దొరకడం లేదు?

వేలాది సెల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి స్వాధీనం చేసుకుంటున్న పోలీసు యంత్రాంగానికి.. ప్రమాదంలో మృతి చెందిన యువకుడి ఫోన్ మాత్రం ఎందుకు చిక్కడం లేదు?

👉 ఇది పోలీసుల సామర్థ్యాన్ని శంకించే ప్రశ్న కాదు.. ఓ తల్లి కన్నీటి వెనుక ఉన్న చివరి ఆశ !

కొడుకును అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ తల్లిదండ్రులకు విధి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇక ఆ ఐఫోన్‌లో ఉన్నాయేమోనని భావిస్తున్న కొడుకు, అతడి స్నేహితుల చివరి సంతోష క్షణాల దృశ్యాల కోసం ఆ తల్లి కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఆ ఫోన్‌లోని జ్ఞాపకాలు ఆమెకు ఇక కొడుకుతో మిగిలిన చివరి అనుబంధం కావచ్చు. అందుకే ఆ ఫోన్ కోసం కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

👉 జగిత్యాల పోలీస్ యంత్రాంగం ఈ తల్లి కన్నీటిని తుడుస్తుందా?


👉 ఆ యువకుడి ఐఫోన్‌ను గుర్తించి కుటుంబానికి అప్పగిస్తుందా?

👉 ₹1.75 లక్షల ఫోన్ కాదు.. తల్లికి కొడుకుతో మిగిలిన చివరి జ్ఞాపకం !

👉 సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ఫోన్ ఆచూకీని ఛేదిస్తుందా?
ఇప్పుడు సమాజం చూపు పోలీసు శాఖ స్పందనపైనే ఉంది.