నా ఊపిరి ఉన్నంతవరకు స్వామివారికి సేవ చేస్తా !

👉 ధర్మపురి ఉగ్రనరసింహుడి ఆలయానికి మహర్దశ !

👉 శాస్త్ర, ఆగమ నిబంధనలతో శతాబ్దాల పాటు నిలిచేలా పునఃనిర్మాణం !

👉 ధర్మపురి అభివృద్ధికి ₹150 కోట్ల వరకు నిధులు.. పుష్కర ఘాట్లు, బైపాస్, సెంట్రల్ లైటింగ్‌కు పెద్దపీట !

👉 ప్రజల అభిప్రాయాల మేరకే ఆలయ అభివృద్ధి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఆలయాన్ని కేవలం తాత్కాలికంగా కాకుండా రాబోయే వందేళ్ల పాటు చరిత్రలో నిలిచేలా, శాస్త్రం–ఆగమ నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.

ఆలయ పునఃనిర్మాణం, ధర్మపురి పుష్కరాల అభివృద్ధిపై శనివారం ఆలయ ప్రాంగణంలో  నిర్వహించిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మధుసూదన్ , ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల  శ్రీనివాస్ , ప్రముఖ వాస్తు శాస్త్ర వేణు కౌశిక్ ఆచార్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సంఘనపట్ల దినేష్, పాల్గొన్నారు..అర్చకులు, వేద పండితులు, స్థానిక ప్రజలు, భక్తులు, తమ అభిప్రాయాలు, సందేహాలు, సలహాలు, నిర్మొహమాటంగా మంత్రి, కమీషనర్  ముందు వ్యక్తం చేశారు.


👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. స్వామివారి సేవను రాజకీయ పదవుల కంటే గొప్ప బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
“నన్ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసింది స్వామివారి దయే.. నా ఊపిరి ఉన్నంతవరకు స్వామివారికి సేవ చేస్తా” అంటూ మంత్రి భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఆలయ అభివృద్ధి విషయంలో ఎలాంటి పట్టింపులకు పోకుండా అందరూ సమష్టిగా ఆలోచించాలని బ్రాహ్మణులు, పండితులు, ధర్మపురి ప్రజలను చేతులు జోడించి కోరారు.

👉 తిరుమల తరహాలో భవిష్యత్ దృష్టితో..!

తిరుమల తిరుపతి దేవస్థానం గత రెండు దశాబ్దాల్లో సాధించిన అభివృద్ధిని ప్రస్తావించిన మంత్రి.. వేములవాడ, కాలేశ్వరం, బాసర, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. అదే తరహాలో ధర్మపురి క్షేత్రాన్ని కూడా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.


ఆలయాన్ని ఉన్నచోటే అభివృద్ధి చేయాలా? లేక మరింత విస్తీర్ణంలో పునఃనిర్మించాలా? అనే అంశంపై ప్రజలు, పండితులు, బ్రాహ్మణుల సూచనలు కీలకమని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను కేవలం నమోదు చేసుకుని వెళ్లిపోవడం కాకుండా.. వాటిని ప్రభుత్వం తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.

👉 ఉగ్రనరసింహ ఆలయానికి  ₹10 కోట్లు !

శ్రీ ఉగ్రనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణానికి ₹10 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అదే సమయంలో పురావస్తు శాఖ పరిధిలో ఉన్న యోగ నరసింహస్వామి, ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు, సంబంధిత ప్రక్రియలు అవసరమని చెప్పారు. అన్ని అనుమతులు, బడ్జెట్ అంశాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

👉 ధర్మపురి అభివృద్ధికి ₹150 కోట్ల వరకు !

ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ₹ 117 కోట్లను కేటాయించిందని మంత్రి వెల్లడించారు. పుష్కర ఘాట్లు, రహదారుల విస్తరణ తదితర పనులతో పాటు అదనంగా మరో ₹ 40 కోట్ల నిధులను బైపాస్ రోడ్డు, ఇతర అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయడానికి ఆమోదం లభించిందని తెలిపారు.

దీంతో ధర్మపురి అభివృద్ధికి కేటాయింపులు సుమారు ₹150 కోట్లకు చేరువయ్యాయని మంత్రి పేర్కొన్నారు. పుష్కర ఘాట్లు, బైపాస్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ తదితర పనులు ధర్మపురి రూపురేఖలను మార్చనున్నాయని అన్నారు.

👉 విద్య, పారిశుధ్యానికి కూడా పెద్దపీట !

ధర్మపురిలో డిగ్రీ కళాశాలతో పాటు అగ్రికల్చర్ కళాశాలను తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మురుగునీటి సమస్యను పరిష్కరించేందుకు ₹17 కోట్లతో సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

ధర్మపురి క్షేత్ర అభివృద్ధి కేవలం ఆలయానికే పరిమితం కాకుండా.. ఆధ్యాత్మికత, పర్యాటకం, మౌలిక వసతులు, విద్య, పారిశుధ్యం వంటి అన్ని రంగాల్లో సమగ్రంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.


ప్రజల సూచనలు – పండితుల అభిప్రాయాలు – ప్రభుత్వ సంకల్పం.. ఈ మూడు సమన్వయంతో ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని భవిష్యత్ తరాలకు మరింత వైభవంగా అందించేందుకు కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు.