👉 ధాన్యం లేదా డబ్బు వసూలు చేయాల్సిందే !
👉 ఉద్దేశపూర్వక ఎగవేతలకు పాల్పడితే కఠిన చర్యలు !
👉 మొండి బకాయిదారులకు ధాన్యం కేటాయింపులు నిలిపివేత !
👉 మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు !
👉 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి !
J.SURENDER KUMAR,
మిల్లర్లు ప్రభుత్వానికి బకాయిపడిన ధాన్యం విలువకు సంబంధించిన మొత్తాన్ని నిర్బంధంగా వసూలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకుని బకాయిల చెల్లింపులో జాప్యం చేసే మిల్లర్లపై ఇక కఠిన వైఖరి అవలంబించాలని స్పష్టం చేశారు. వ్యాపార దృక్పథంతో మిల్లులు నిర్వహించే వారితో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని, ఉద్దేశపూర్వకంగా బకాయిల ఎగవేతకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
👉 పౌరసరఫరాల శాఖపై శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల బకాయిలకు అవకాశం కల్పించారని, ఆ తప్పిదాన్ని ప్రస్తుత ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని సీఎం విమర్శించారు. ఇప్పటికే బకాయిల వసూళ్లలో కొంత పురోగతి సాధించినప్పటికీ.. ప్రతి ధాన్యం గింజకు సంబంధించిన బకాయి వసూలు కావాల్సిందే అని స్పష్టం చేశారు.
👉 బకాయిల వసూలుకు ప్రత్యేక విధివిధానాలు !
బకాయిల వసూలుకు స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాలని సూచించారు. ఉపసంఘం పరిశీలన అనంతరం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
👉 మొండి మిల్లర్లకు చెక్.. మహిళా సంఘాలకు అవకాశం!
బకాయిలు చెల్లించకుండా మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలకు కేటాయించి, మిల్లింగ్ బాధ్యతలను వారికి అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. దీంతో ఒకవైపు ప్రభుత్వ బకాయిల వసూళ్లకు మార్గం సుగమం కావడంతో పాటు మరోవైపు మహిళా సంఘాలకు ఆర్థిక కార్యకలాపాల్లో మరింత అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయనుంది.
👉 ధాన్యం నిల్వకు ఇప్పటి నుంచే కార్యాచరణ !
ప్రతి సీజన్‌లో ధాన్యం నిల్వకు ఎదురవుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం భారీగా వచ్చే నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగుల ఏర్పాటును పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని సూచించారు.
👉 SHGలకు భూమి.. ప్రత్యామ్నాయ నిల్వ కేంద్రాలు !
స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సైలో బ్యాగుల నిర్మాణానికి నియోజకవర్గానికి 50 నుంచి 100 ఎకరాల భూమి కేటాయించే అంశాన్ని సీఎం వెల్లడించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ, పౌరసరఫరాలు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే సమయంలో విస్తారమైన ప్లాట్‌ఫాంలను నిర్మించి జర్మన్ టెంట్ల ద్వారా ధాన్యం నిల్వ చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
👉 మండల, గ్రామ స్థాయిలోని ప్రైవేటు గోదాములు, కల్యాణ మండపాలు, పాత థియేటర్లు, ఇతర షెడ్లను ముందుగానే గుర్తించి అవసరమైన సమయంలో ధాన్యం నిల్వకు లీజుకు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
