సీఎం రేవంత్ రెడ్డితో రైతు సంక్షేమ కమిషన్ బృందం భేటీ !

J SURENDER KUMAR,

రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థపై వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని కలిసి నివేదిక అందించింది. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే సాంకేతిక యూనిట్లతో చిన్న నీటిపారుదల వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేయాలని కమిషన్ తన నివేదికలో సూచించింది.

👉 తెలంగాణ వ్యవసాయ – రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండ రెడ్డి  నేతృత్వంలో సభ్యులు రాములు నాయక్ , రాంరెడ్డి గోపాల్ రెడ్డి , గంగాధర్ , ఎం. భవానీరెడ్డి  ముఖ్యమంత్రి ని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి నివేదిక అందించారు.

👉 కమిషన్ సిఫారసులపై ముఖ్యమంత్రి  వారితో చర్చించారు. పంటల మార్పిడి, ఉద్యానవన పంటల సాగు పెంపు, ఎఫ్‌పీవోల ఏర్పాటు వంటి అంశాలపై కమిషన్ దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  సూచించారు.

👉 రాష్ట్రంలో చిన్న నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి నివేదికలో కమిషన్ ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేసింది. చిన్న, పెద్ద నీటిపారుదల వనరులను కలిపే కమాండ్ ఏరియా ఆధారిత నిర్వహణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించింది.

👉 చెరువుల పరిరక్షణకు ప్రత్యేకంగా చిన్న నీటిపారుదల చట్టం రూపొందించాలని, చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL) సరిహద్దులను తక్షణం గుర్తించి ఆక్రమణలను తొలగించి పరిరక్షించాలని సూచించింది.

👉 తెలంగాణలో నీటి భద్రత, వ్యవసాయ స్థిరీకరణ, గ్రామీణ జీవనోపాధుల అభివృద్ధికి చెరువుల పునరుద్ధరణ అత్యంత అవసరమని తెలిపింది.

👉 గడిచిన రెండేళ్ల కాలంలో రైతు కమిషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వానికి అందించిన సూచనలను కమిషన్ ప్రతినిధి బృందం వివరించింది. కమిషన్ పనితీరుపై ముఖ్యమంత్రి  సంతృప్తిని వ్యక్తం చేశారు.