నేడు మండల స్థాయిలోనూ “ప్రజావాణి” కార్యక్రమం !

👉 మండల పరిషత్  ( MPDO )  కార్యాలయంలో..

👉 ప్రతి సోమవారం ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహణ !

👉 జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిలలో ప్రజావాణి యథావిధిగా కొనసాగింపు !

👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ! 

J.SURENDER KUMAR,

ప్రజల సమస్యలను వారి నివాస ప్రాంతాలకు మరింత చేరువలో పరిష్కరించడంతో పాటు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, వేగవంతమైన స్పందనను పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలోనూ “ప్రజావాణి” కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్  ప్రకటనలో తెలిపారు.

జగిత్యాల జిల్లాలో నేటినుంచి అనగా 17.08.2026 నుంచి ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం (MPDO Office)లో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

👉 ఇప్పటికే కొనసాగుతున్న జిల్లా స్థాయి, మరియు రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, వీటికి అదనంగా ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా మండల స్థాయి ప్రజావాణిని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ పేర్కొన్నారు.

👉 ఎంపీడీఓ నోడల్ అధికారిగా బాధ్యతలు !

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.

👉 మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు ప్రజావాణికి తప్పనిసరిగా హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు ప్రారంభించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

👉 మండల స్థాయి ప్రజావాణికి ఎంపీడీఓ, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, మండల వ్యవసాయ అధికారి, ఉద్యానవన అధికారి, పశువైద్యాధికారి, మత్స్యశాఖ అధికారి, మండల విద్యాధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, సీడీపీఓ, అంగన్‌వాడీ సూపర్‌వైజర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, గృహ నిర్మాణ, గ్రామీణ నీటి సరఫరా, రహదారులు–భవనాలు, నీటిపారుదల, భూగర్భ జల, అటవీ, విద్యుత్ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత ఇతర మండల స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు.

👉 ప్రతి వినతి ఆన్‌లైన్‌లో నమోదు

మండల స్థాయి ప్రజావాణిలో అందే ప్రతి వినతిని ఏకీకృత ప్రజావాణి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేస్తారని కలెక్టర్ తెలిపారు. దరఖాస్తుదారులు సమర్పించే వినతిపత్రంతో పాటు సంబంధిత ఆధారాలు, ధ్రువపత్రాలను స్కాన్ చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారని పేర్కొన్నారు.

👉 వినతి నమోదు చేసిన అనంతరం దరఖాస్తుదారుడికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదు అందజేస్తారని తెలిపారు. ఈ గ్రీవెన్స్ ఐడీ ఆధారంగా దరఖాస్తుదారులు తమ ఫిర్యాదు పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

👉 ప్రజలు తమ వినతులకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబర్, చిరునామా, అవసరమైన ఆధారాలు, గతంలో సమర్పించిన దరఖాస్తుల వివరాలు ఉంటే వాటిని వెంట తీసుకురావాలని సూచించారు.

👉 ప్రత్యేక సహాయ కేంద్రాల ఏర్పాటు !

ప్రతి మండల ప్రజావాణి కేంద్రంలో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సదుపాయాలతో ప్రత్యేక ఫిర్యాదుల నమోదు కౌంటర్ ఏర్పాటు చేయాలని సంబంధిత ఎంపీడీఓలను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు వినతులు రాయడంలో సహాయం చేయడానికి, గతంలో సమర్పించిన వినతుల స్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

👉 ప్రజావాణికి వచ్చే వారికి తగిన కూర్చునే సౌకర్యం, సురక్షిత తాగునీరు, ఆరోగ్య సహాయ కేంద్రం, మరుగుదొడ్లు, అవసరమైన వారికి వీల్‌చైర్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

👉  దివ్యాంగులు, వృద్ధుల కు  ప్రాధాన్యం !

దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణులు, చంటిపిల్లలతో వచ్చే మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారు మరియు ఇతర ప్రత్యేక అవసరాలున్న వారికి వినతుల స్వీకరణలో ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా సక్రమమైన టోకెన్ విధానం, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి, స్నేహపూర్వక వాతావరణంలో వినతులను స్వీకరించాలని సూచించారు.

మండల పరిధిలోనే పరిష్కరించగల సమస్యల కోసం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి హాజరై వినతులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

అధికారులు ప్రజల నుంచి అందే వినతులను కేవలం స్వీకరించడానికే పరిమితం కాకుండా, నిర్ణీత గడువులో నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కారం సాధ్యం కాని సందర్భాలలో అందుకు సంబంధించిన స్పష్టమైన కారణాలను దరఖాస్తుదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణి వినతుల నమోదు, శాఖలకు పంపిణీ, పరిష్కార పురోగతి, తుది పరిష్కారం తదితర అంశాలను జిల్లా స్థాయిలో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు.