నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలో వసతులు కల్పిస్తాం!

👉 రోడ్లు, సెల్ టవర్, నీటి వసతులు, పాఠశాల, ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం !

👉 మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి !

👉 లబ్ధిదారులతో కలిసి నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రులు పొంగులేటి, అడ్లూరి !


J.SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా కేంద్ర సమీప నూకపల్లి 2బీహెచ్‌కే గృహ సముదాయంలో నివసిస్తున్న లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.

శుక్రవారం జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా నూకపల్లి 2బీహెచ్‌కే గృహ సముదాయాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సి.సి.ఎల్.ఏ. కమిషనర్ లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పెషల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, హౌసింగ్ ఎం.డి. గౌతమ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌లతో కలిసి మంత్రులు పరిశీలించారు. మిషన్ భగీరథ ట్యాంక్ పైనుంచి నూకపల్లి గృహ సముదాయాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులతో కలిసి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు లబ్ధిదారులతో మాట్లాడి కాలనీలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

👉ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతు….

నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలో ఇళ్లతో పాటు అవసరమైన మౌలిక వసతుల పనులను చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 160 ఇళ్ల ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకులు వాటర్ డ్రెయిన్, సీవరేజ్ లైన్ల నిర్మాణానికి ₹.52.57 లక్షలు మంజూరు చేశామని , ఇందులో ₹.51.09 లక్షలు ఖర్చు చేశామని తెలిపారు. 360 ఇళ్ల ప్రాంతంలో ఇదే తరహా పనులకు ₹ 99.25 లక్షలు మంజూరు చేసి ₹ 88.48 లక్షలు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.

👉 4,000 ఇళ్ల ఫేజ్-2 ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకులు, సీవరేజ్ లైన్లు, ఇన్‌స్పెక్షన్ చాంబర్లు, వాటర్ డ్రెయిన్లు, మెయిన్ డ్రెయిన్, అంతర్గత డ్రెయిన్ల నిర్మాణానికి ₹11.30 కోట్ల మేర నిధులు మంజూరు కాగా, ₹10.81 కోట్ల మేర ఖర్చు చేసినట్లు తెలిపారు.4,000 ఇళ్ల ప్రాంతంలో విద్యుత్ లైన్లు, ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డుల ఏర్పాటుకు ₹ 6.05 కోట్లు మంజూరు చేసి ₹.5.01 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 4,000 ఇళ్ల ప్రాంతంలో సెప్టిక్ ట్యాంకులు, సీవరేజ్ లైన్లు, సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు రూ.5 కోట్లు మంజూరు చేసి ₹ 4 కోట్లు పనులు పూర్తి చేసినట్లు వివరించారు.4,520 ఇళ్లకు మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా పనులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.


👉 లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్న మంత్రి..

నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలో లబ్ధిదారులతో మంత్రి నేరుగా మాట్లాడారు. కాలనీలో రోడ్లు, సెల్ టవర్, తాగునీటి వసతులు, పాఠశాల, ఆసుపత్రి వంటి సౌకర్యాలు కల్పించాలని లబ్ధిదారులు మంత్రిని కోరారు. లబ్ధిదారులు తెలిపిన సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. రోడ్లు, సెల్ టవర్, నీటి వసతులు, పాఠశాల, ఆసుపత్రి వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను మూడు నెలల్లోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.


👉 అంగన్‌వాడీ కేంద్రంలో వసతులపై ఆరా !


అనంతరం నూకపల్లి 2బీహెచ్‌కే కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరిశీలించారు. కేంద్రంలో ఉన్న చిన్నారుల కు అక్షరాభ్యాసం చేశారు.పిల్లల సంఖ్య, వారికి అందుతున్న వసతులు, ఇంకా అవసరమైన సౌకర్యాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు మెరుగైన వాతావరణం కల్పించేలా అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.