ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ సస్పెన్షన్‌కు మంత్రి ఆదేశం !

👉 ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెవెన్యూ, హౌసింగ్‌పై మంత్రి పొంగులేటి సుదీర్ఘ సమీక్ష !


J.SURENDER KUMAR,

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని
విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.


ఇకపై రెవెన్యూ, తహసీల్దార్, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు, నిర్వహిస్తానని, నిఖీల్లో తప్పులు దొర్లితే ఎవరినీ ఉపేక్షించబోనని మంత్రి హెచ్చరించారు. మరికొంత మంది అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, హౌసింగ్ శాఖల అధికారులతో మంత్రి పొంగులేటి సుమారు నాలుగు గంటల పాటు విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.

ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, భూ రీ సర్వే, 22-ఏ కేసులు, భూ భారతి దరఖాస్తులు, అసైన్‌డ్ భూముల సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షించారు.

సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన ఆదేశాలను ఈరోజు నుంచే కార్యాలయాల్లో అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష కేవలం మొదటి సమావేశం మాత్రమేనని, ఇకపై ఆకస్మిక తనిఖీలు, నిరంతర పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

👉అధికారులు పద్ధతి మార్చుకోవాలి..

ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు” అని మంత్రి హెచ్చరించారు. అధికారులు తమకు కేటాయించిన హెడ్‌క్వార్టర్లలో నివాసం ఉంటున్నారా ? లేదా ? అనే అంశంపై నివేదిక తెప్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ప్రజలతో అధికారులు, సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. . ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో చిన్న రెవెన్యూ సమస్యను కూడా అధికారులు గుర్తించి పరిష్కరించాలన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

రెవెన్యూ శాఖపై ఉన్న అవినీతి మచ్చను చెరిపేలా అధికారులు పనిచేయాలని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలితే సస్పెన్షన్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసినట్లు మహిళ ఫిర్యాదు చేసిన ఘటనపై సంబంధిత తహసీల్దార్‌కు ఛార్జ్ మెమో జారీ చేయాలని ఆదేశించారు. కలెక్టర్లకు సమాచారం ఇవ్వకుండానే ఆకస్మిక తనిఖీలకు వస్తానని మంత్రి స్పష్టం చేశారు.

👉 రీ సర్వే, ఇందిరమ్మ ఇళ్లపై వేగం !

భూ రీ సర్వే పనులను పెండింగ్‌లో పెట్టే అధికారులపై చర్యలు తప్పవన్నారు. లైసెన్సు సర్వేయర్లకు ప్రతి 15 రోజులకు ఎకరాకు ₹ 60 చొప్పున చెల్లించాలని ఆదేశించారు.

👉 ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశలోని ఎల్-3 సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని, రెండో దశ ఇళ్ల మంజూరుకు ముందు లబ్ధిదారుల అర్హతను రెండుసార్లు పరిశీలించాలని ఆదేశించారు.

👉 22-ఏ, అసైన్‌డ్ భూముల కేసులను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. అవసరమైతే 24 గంటలూ పనిచేసి కేసులను పూర్తి చేయాలని సూచించారు.

ఈ సమావేశం ప్రారంభం మాత్రమేనని.. ఇకపై కార్యాలయాల పనితీరు, అధికారుల విధి నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.