ఓ టీచర్ ఓ వార్త ₹25 లక్షల పరిష్కారం !

👉 టీచర్ త్యాగం… ప్రభుత్వాన్ని కదిలించింది !

👉 స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

👉 గోపాలపురం పాఠశాలకు ₹ 25 లక్షలు మంజూరు.!

👉 సేవాభావానికి లభించిన ప్రభుత్వ గుర్తింపు !


J.SURENDER KUMAR,


ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కథ చివరకు ఆశాజనక మలుపు తిరిగింది. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో చిన్నారుల భద్రత ప్రమాదంలో పడినా, మరమ్మతుల కోసం చేసిన విజ్ఞప్తులు అధికార యంత్రాంగాన్ని కదిలించలేకపోయాయి. కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి నిబద్ధత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించేలా చేసింది.

పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నిమ్మతోట ఇందిర భవనం ప్రమాదకరంగా మారడంతో విద్యార్థుల చదువు ఆగకూడదనే సంకల్పంతో తన సొంత వేతనం నుంచి సుమారు ₹ 40 వేల రూపాయలు వెచ్చించి రేకుల షెడ్డు నిర్మించారు. గత ఏడాది కాలంగా అదే షెడ్డు కింద చిన్నారులకు విద్యాబోధన కొనసాగిస్తూ, ఉపాధ్యాయ వృత్తి అంటే ఉద్యోగం మాత్రమే కాదని ఆచరణలో చూపించారు.

గురువారం ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త (ఫైల్ ప్రతి)

ఈ మానవీయ ఘటనపై ఈనాడు దినపత్రికలో వెలువడిన వార్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన ఆయన, ఖమ్మం జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్‌ను పాఠశాలను సందర్శించి అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ స్వయంగా ఉపాధ్యాయురాలు ఇందిరతో మాట్లాడి పాఠశాల పరిస్థితులను తెలుసుకోవడం ఈ అంశానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను చాటింది.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గురువారం పాఠశాలను సందర్శించిన కలెక్టర్ టీఎస్ దివాకర్, ఉపాధ్యాయురాలు ఇందిర సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పాఠశాలలో కొత్త తరగతి గదుల నిర్మాణానికి ₹25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, వెంటనే నిధులు విడుదల చేశారు.


ఈ సంఘటన ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. వ్యవస్థ స్పందించకపోయినా బాధ్యత నుంచి వెనక్కి తగ్గని ఓ ఉపాధ్యాయురాలి కర్తవ్యనిష్ఠ, చివరకు ప్రభుత్వాన్నే కదిలించింది. ఇది కేవలం ఒక పాఠశాలకు నిధులు మంజూరైన కథ కాదు, విద్యపై అంకితభావం ఉంటే ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం కూడా పాలనా వ్యవస్థ దృష్టిని ఆకర్షించగలదని నిరూపించిన ఉదాహరణ.

ఉపాధ్యాయురాలు ఇందిరాను అభినందించి సన్మానిస్తున్న కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగం ( ఫైల్ ఫోటో)


వార్తలు సమస్యలను మాత్రమే చెప్పవు… పరిష్కారాలకు దారితీస్తాయని గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఘటన మరోసారి నిరూపించింది. ఒక ఉపాధ్యాయురాలి సేవాభావం, మీడియా పాత్ర, ప్రభుత్వ తక్షణ స్పందన కలిసి చిన్నారుల భవిష్యత్తుకు కొత్త భరోసా ఇచ్చాయి.