పాఠశాలలో మాతృభాషకు కొత్త ఊపిరి !

👉 డిజిటల్ యుగంలో ‘తెలుగు బడి’..!

👉 AI సాయంతో తెలుగు బోధనకు సరికొత్త దారి చూపిన..
  ఉపాధ్యాయుడు డా. గొల్లపెల్లి గణేశ్ !


  J.SURENDER KUMAR,

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన అంటే గణితం, సైన్స్ వంటి సబ్జెక్టులకే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు అదే సాంకేతికతతో తెలుగు భాషను కూడా విద్యార్థులకు సులభంగా, ఆసక్తికరంగా బోధించవచ్చని నిరూపిస్తున్నారు, వేలాది మంది ఉపాధ్యాయులు, లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఉపయోగపడుతున్న ‘తెలంగాణ బడి’ డిజిటల్ వేదిక రూపకర్త జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) డా. గొల్లపెల్లి గణేశ్.

తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానెల్ (IFP) స్మార్ట్ బోర్డులను అందించినా, తెలుగు పాఠ్యాంశాలకు తగిన డిజిటల్ కంటెంట్ లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ఆయన ఒక అవకాశంగా మార్చుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వినియోగించి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠాలను చిత్రాలు, మైండ్ మ్యాప్స్, విజువల్ ప్రజెంటేషన్లతో రూపొందించారు.

వెబ్సైట్ రూపకర్త డాక్టర్ గొల్లపల్లి గణేష్..(ఫోటో)

మొదట వాట్సాప్ ద్వారా పంచుకున్న ఈ పాఠాలు విశేష ఆదరణ పొందడంతో వాటిని మరింత విస్తరించి ‘తెలంగాణ బడి’ అనే డిజిటల్ వేదికగా తీర్చిదిద్దారు.

👉 తెలంగాణ బడి డాట్ ఇన్’ (telanganabadi.in) ఆవిర్భావం.!

తెలుగు బడి వెబ్సైట్ ఆవిష్కరించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ( ఫైల్ ఫోటో )

పాఠ్యాంశాలతో పాటు సమగ్ర సమాచారాన్ని ఒకే వేదికపై అందించాలనే సంకల్పంతో డా. గణేశ్ స్వయంగా ‘telanganabadi.in’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు.

👉 వెబ్‌సైట్ ప్రధాన ప్రత్యేకతలు:

@ – డిజిటల్ పాఠాలు & మైండ్ మ్యాప్స్: సంక్లిష్టమైన పద్యాలు, పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా దృశ్యరూపంలో సమర్పణ !
@ – ఇంటరాక్టివ్ క్విజ్‌లు: ప్రతి పాఠం చివరలో విద్యార్థులు తమ ప్రగతిని స్వయంగా అంచనా వేసుకునేందుకు క్విజ్ సదుపాయం.!

@ – వ్యాకరణం & ఉపవాచకాలు: రామాయణం, వ్యాకరణాంశాలను బొమ్మల సాయంతో ఆసక్తికరంగా బోధించే వెసులుబాటు.!

@ – పరీక్షల ప్రత్యేక విభాగం: 10వ తరగతి విద్యార్థుల కోసం బిట్ బ్యాంకులు, ముఖ్యమైన ప్రశ్నలు.!

ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా వందలాది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ వెబ్‌సైట్‌ను వినియోగిస్తున్నారు. ప్రతి నెలా సగటున 50 వేల మందికి పైగా విజిటర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను సందర్శించడం దీని ప్రజాదరణకు నిదర్శనం.

విద్యార్థులకు డిజిటల్ విద్యాబధన (ఫైల్ ఫోటో)

ఈ వేదికలో పాఠ్యాంశాలు మాత్రమే కాకుండా, వ్యాకరణం, ఉపవాచకాలు, రామాయణ భాగాలు, బిట్ బ్యాంకులు, ముఖ్యమైన ప్రశ్నలు, ప్రతి పాఠం అనంతరం ఇంటరాక్టివ్ క్విజ్‌లు అందుబాటులో ఉండటంతో విద్యార్థులు స్వయంగా తమ అభ్యాసాన్ని పరీక్షించుకునే అవకాశం కలుగుతోంది. దీంతో ఉపాధ్యాయుడి బోధనకు సాంకేతికత సమర్థవంతమైన తోడ్పాటుగా మారుతోంది.

👉 డాక్టర్ గణేష్ ఉపాధ్యాయుడే కాదు….

డా. గొల్లపెల్లి గణేశ్ సాధారణ ఉపాధ్యాయుడు మాత్రమే కాదు; విద్య, సాంకేతికత, సేవా రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి:

👉 అత్యుత్తమ విద్యాభ్యాసం:

కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “అంతర్జాలంలో తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనం” అనే అంశంపై పిహెచ్.డి. పూర్తి చేశారు. ఈ పరిశోధనా గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ పుస్తకంగా ప్రచురించడం విశేషం.

👉 గ్రాఫిక్ డిజైనింగ్ అనుభవం !

ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరడానికి ముందు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC)లో రెండేళ్ల పాటు 2D గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశారు. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఆయన రూపొందించిన ‘pushkaralu.com’ వెబ్‌సైట్‌ను నాటి దేవాదాయ శాఖ మంత్రి ప్రారంభించారు.

👉 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు !

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న గణేష్ ( ఫైల్ ఫోటో)

విద్యా రంగానికి ఆయన చేసిన విశేష సేవలకుగాను 2020లో జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 2025లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించాయి.

👉 సామాజిక సేవ !’

వుయ్ హెల్ప్ యూ (WHY)’, విద్యార్థి దత్తత కార్యక్రమాల ద్వారా సుమారు రూ. 60 లక్షల విలువైన సేవా కార్యక్రమాలు, విద్యార్థి దత్తత కార్యక్రమాలను నిర్వహించి తన మానవతాదృక్పథాన్ని చాటుకున్నారు.

డిజిటల్ కంటెంట్ కొరతను ఒక వ్యక్తి తన సృజనాత్మకతతో భర్తీ చేయడం ప్రభుత్వ విద్యా వ్యవస్థకు సానుకూల సంకేతంగా మారింది.

👉 డిజిటల్ యుగంలో మాతృభాష కు ప్రత్యేక స్థానం!

నూతన విద్యా విధానం డిజిటల్ లెర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న ఈ సమయంలో, మాతృభాషను కూడా అదే స్థాయిలో సాంకేతికతతో అనుసంధానం చేయడం అత్యవసరం. డా. గొల్లపెల్లి గణేశ్ చేసిన ప్రయత్నం ఒక వ్యక్తిగత ఆవిష్కరణ మాత్రమే కాదు; ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఆదర్శ నమూనా. ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వ స్థాయిలో విస్తరించగలిగితే, తెలుగు బోధన మరింత సులభం, ఆకర్షణీయం, ఫలవంతం కావడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగే అవకాశం ఉంది.


డిజిటల్ యుగంలో మాతృభాషను సజీవంగా నిలబెట్టే ప్రయత్నాలే రేపటి విద్యకు బలమైన పునాది. డా. గొల్లపెల్లి గణేశ్ వంటి ఉపాధ్యాయుల కృషి ఆ మార్పుకు దిశానిర్దేశం చేస్తోంది.