ప్రతి ఆరు నెలలకు ఓ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తాం!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

రాబోయే ఏడాదిన్నర కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, అల్వాల్ టిమ్స్‌, ఎల్‌బీనగర్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లను వరుసగా ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి తీసిపోని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

👉 హైదరాబాద్ సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (#DrMCRTIMS) ను ముఖ్యమంత్రి  ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పొన్నం ప్రభాకర్ పలువురు ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

👉 అనంతరం ఆసుపత్రి ఆవరణలో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్, సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్, వరంగల్ ఆసుపత్రిని అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి వేగంగా నిర్మాణాలు పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.

👉 “ఈ ఆసుపత్రులన్నీ పూర్తయితే రాష్ట్రంలో 10 వేల పడకల ఆసుపత్రులు పేదలకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్రంలోని పేదలకు ఒక విశ్వాసాన్ని ఇవ్వగలుగుతాం.

👉 ఎయిమ్స్‌తో పోటీపడే సేవలు అందిస్తున్న నిమ్స్‌ ఆసుపత్రికి ధీటుగా ఒక్కో ఆసుపత్రికి ఒక్కో డైరెక్టర్‌ను నియమించి వారి పర్యవేక్షణలో వీటిని తీర్చిదిద్దుతాం. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయడమే కాకుండా నిర్వహణలో ఏ కార్పొరేట్ ఆసుపత్రి తీసిపోని విధంగా నిర్వహిస్తాం” అని ముఖ్యమంత్రి  పేర్కొంటూ అందుకు ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

👉 “ఈ ఆసుపత్రులకు వచ్చే వారికి ఉచితంగా భోజనం. అటెండెంట్లకు ఉండడానికి డార్మెటరీలు, ఇతర వసతులు కూడా కల్పించాలి. దానికి అవసరమైన నిధులు కేటాయించడమే కాకుండా సూపర్ పీజీని, నర్సింగ్‌ కాలేజీని కూడా ఇక్కడ మంజూరు చేయాలి” అని ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు.

👉 “ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్య రంగాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా ముందుకు తీసుకెళ్తున్నాం. విద్యా రంగానికి ప్రాధాన్యతనిస్తూ సమూలమైన మార్పులు అందరికీ తెలిసిందే. నర్సింగ్‌లో ఉన్న మహిళలు ఇప్పటివరకు మిడిల్ ఈస్ట్ దేశాల్లోనే సేవలు అందిస్తున్నారని, భవిష్యత్తులో జర్మన్, జపనీస్, కొరియన్ భాషలను నేర్చుకుని ఆయా దేశాల్లో లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

👉 ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో ఇప్పటి వరకు 16 వేల మంది సిబ్బందిని నియమించాం. గతంలో ఎప్పుడూ ఇంత పెద్దఎత్తున నియామకాలు చేపట్టలేదు.

👉 పేదల ఆరోగ్యం మా బాధ్యతగా భావిస్తున్నాం. విద్య మీద పెట్టుబడి కానీ, వైద్యం మీద కేటాయించే నిధులను గానీ ఖర్చు కిందనో, సంక్షేమ పథకం కిందనో చూడడం లేదు. భవిష్యత్ కోసం పెట్టుబడిగా భావిస్తున్నాం. పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్యం అత్యంత ఖరీదైనదిగా మారింది.

👉 పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో చేరితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి. చివరకు కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో, దేశంలో వైద్యం అత్యంత ఖరీదైనదిగా మారింది. గతంలో సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీ నగర్‌లలో ఆసుపత్రుల నిర్మాణానికి టెంకాయ కొట్టి తర్వాత నిధులు, నిర్మాణం మరిచిపోయారు. వరంగల్‌లో పెద్దాసుపత్రి కడుతామని, ఉన్నదాన్ని నిర్వీర్యం చేశారు.

👉 అందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణమైన అవగాహనతో రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు, ప్రతివాడికి వైద్యం అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే గుండె, కిడ్నీలు బాగా ఉండాలి. గుండె, కిడ్నీలు, అవయవ మార్పిడికి సంబంధించి సనత్‌నగర్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించుకోవడం పేదలకు అత్యంత ప్రయోజనకరం” అని ముఖ్యమంత్రి  చెప్పారు.

👉 “32 నెలల ప్రజా పాలనలో ఆరోగ్యశ్రీ కోసం దాదాపుగా ₹2,700 కోట్లు ఖర్చు పెట్టాం. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ₹2,526 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రెండు పథకాల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో ₹ 5,226 కోట్లు ఖర్చు చేశాం. దేశంలో పేదల కోసం ఈ స్థాయిలో నిధులను ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు.

👉 ఆరోగ్య, వైద్య శాఖ ప్రతిఏటా సగటున ₹13 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తే, ప్రజా ప్రభుత్వంలో ఇప్పటివరకు ₹ 21,800 కోట్ల నిధులను ఖర్చు పెట్టాం. ఈ ఖర్చును మేం బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజల మా మీద పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా నిరంతరం రూపాయి రూపాయి కూడా బెట్టి పేదల వైద్యానికి నిధులను అందుబాటులోకి తీసుకొచ్చాం.

👉 వందేళ్ల కిందట నిజాం సర్కార్ పేదల కోసం ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ని ప్రారంభిస్తే, అదిప్పుడు కూలిపోయే పరిస్థితికి వచ్చింది. వర్షాలొస్తే హాస్పిటల్ లోపలి వరదలు వచ్చే పరిస్థితిలో అక్కడ వైద్యం అందించడం కూడా కష్టమైంది. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న వారు ఉస్మానియా ఆసుపత్రిని మరోచోట నిర్మించాలన్న ఆలోచన చేయలేదు.

👉 మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పక్కనే గోషమహల్‌లో 30 ఎకరాల్లో ₹ 2,700 కోట్లతో 200 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం. తొందర్లోనే దాన్ని పూర్తి చేసుకోబోతున్నాం” అని తెలిపారు.

👉 “ప్రభుత్వ వైద్యులు అదనపు సమయం సేవలు అందించాలి. వారి నైపుణ్యాన్ని ఇతర ప్రదేశాల్లో ఉపయోగించే పరిస్థితి కాకుండా సర్జరీలు నిర్వహించినప్పుడు, ఇతరత్రా వారికి ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌లు ఇద్దాం” అని ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కి సూచించారు.

👉 “వైద్య, ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేసి ప్రజల్లో విశ్వాసం కల్పించాలని, కష్టమొచ్చినప్పుడు మాకు తెలంగాణ ప్రభుత్వం ఉన్నదన్న భరోసా కల్పించాలి. పేదలకు నమ్మకం, విశ్వాసం కల్పిస్తే మన జన్మ సార్థకమైనట్టే.

👉 నర్సరీ నుండి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య, ఆ తర్వాత అవసరమైన స్కిల్స్‌ నేర్పించగలిగితే, ఏ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం రాదు. వాళ్లే సొంతంగా బతుకుతారు. ఎవరు కూడా ప్రభుత్వం నుండి ఉచితంగా సంక్షేమ పథకాన్ని తీసుకోరు.

👉 కష్టం వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను ఉచితంగా తీసుకోవాలని ఆలోచన చేస్తారు. చాలామంది కష్టపడి ఆత్మగౌరవంతో బతకాలని అనుకుంటారు. సరైన అవకాశాలు అందించనప్పుడే సంక్షేమ పథకాల వైపు చూస్తారు. సర్వ స్వతంత్రంగా వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా ప్రభుత్వ విధానాలను అమలు చేయగలిగితే, ప్రజలు కూడా ప్రభుత్వం నుండి ఉచితంగా ఆశించరు” అని వివరించారు.

👉 తెలంగాణ రాష్ట్రానికి మరొక ఆణిముత్యాన్ని ఈరోజు అంకితం చేస్తున్న ఈ శుభసందర్భంలో ఇందుకోసం అహర్నిశలు కృషి చేసిన మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు సిబ్బందికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  అభినందనలు తెలిపారు.