👉 ఆగస్టు నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేసి సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించాలి !
👉 పుష్కరాల ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులు, కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి !
👉 అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షించాలి !
👉 గోదావరి నది పరివాహక జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు !
J.SURENDER KUMAR,
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గోదావరి నది పరివాహక జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
గోదావరి పరివాహక జిల్లాల కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సోమవారం కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ……..
గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆగస్టు నెలాఖరులోగా అన్ని టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్‌లో పనులను ప్రారంభించాలని తెలిపారు. ఇందుకు అనుగుణంగా అధికారులు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

👉 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరుగుతాయని, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాల కోసం వచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, విద్యుత్, వైద్య సేవలు తదితర అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు.
పుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం ₹ 1, 000 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే Tier-1( టైర్ -1) ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని, అవసరమైన కమాండ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పుష్కరాల ఏర్పాట్లను సమర్థవంతంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
👉 ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, దేవాదాయ, ఇరిగేషన్, టూరిజం, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధాన పుష్కర ప్రాంతాలకు అంతరాయం లేని రహదారి అనుసంధానం కల్పించాలని, అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పనులను చేపట్టాలని తెలిపారు.
👉 పుష్కరాల కోసం చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడరాదని, అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు.
👉 Tier-2 ( టైర్ – 2 ) ప్రాంతాల్లో ₹135 కోట్ల పనులు !
Tier-2 ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం మొత్తం ₹ 135 కోట్ల నిధులు కేటాయించిందని కమిషనర్ తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరగా ఖరారు చేసి టెండర్లు పిలవాలని, స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టాలని సూచించారు.

👉 పనులు త్వరగా ప్రారంభించాల్సిన ప్రాంతాల్లో అవసరమైతే షార్ట్ టెండర్లను నిర్వహించాలని తెలిపారు. L1 ఖరారైన వెంటనే అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తి చేసి పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి పనికి నిర్దిష్ట లక్ష్యాలను నిర్ణయించుకుని ముందుకు సాగాలని, ప్రతి వారం పనుల పురోగతిని సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో తలెత్తే చిన్న సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు.
👉 ప్రధాన పుష్కర ప్రాంతాల్లో పనులు వేగవంతం చేయాలి
భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, బాసర వంటి ప్రధాన పుష్కర ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధి, మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. పుష్కరాల సమయానికి అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
👉 కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ…….
జగిత్యాల జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అదనంగా ₹ 15 కోట్ల నిధులు అవసరమని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సమర్పించామని తెలిపారు. ఈ నిధులతో చేపట్టే 46 పనుల అమలు బాధ్యతను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించాలని కోరారు.

👉 46 పనులకు విడివిడిగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తే జిల్లా స్థాయిలోనే టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే అవసరమైన భూసేకరణ కోసం ₹ 8 కోట్ల నిధులను అత్యవసరంగా మంజూరు చేయాలని కోరారు.
👉 ధర్మపురి – కోటిలింగాల లో
జిల్లాలో Tier-1 పనుల పురోగతి
ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురికి ₹.22.16 కోట్లు, కోటిలింగాలకు ₹ 16.13 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ పనులు టెక్నికల్ ఎవాల్యుయేషన్ దశలో ఉన్నాయని, సెప్టెంబర్ 1, 2026 నుంచి పనులు ప్రారంభించి మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
👉 దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురికి ₹ 10 కోట్లు, కోటిలింగాలకు ₹ 10 కోట్ల నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తై L1 ఖరారైన నేపథ్యంలో పనులు ప్రారంభించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
👉 పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో ధర్మపురిలో 10 పనులకు ₹ 50.55 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం టెండర్ ప్రక్రియ ప్రారంభ దశలో ఉందని, పనులను త్వరగా ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
👉 Tier-2 పనులకు ₹ 12 కోట్లు !
జగిత్యాల జిల్లాలో ఇరిగేషన్ శాఖకు Tier-2 పనుల కోసం ₹ 12 కోట్ల నిధులు మంజూరయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, టెండర్ ప్రక్రియలను వేగవంతం చేసి పుష్కరాల నాటికి అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్ణీత లక్ష్యాలు, గడువుల ప్రకారం పనులను పూర్తి చేసేలా నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి. రాజ గౌడ్, సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
