కష్టపడిన కార్యకర్తలకే పదవుల్లో ప్రాధాన్యం !

👉 క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం !

👉 భువనగిరిలో ముగిసిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ !

👉 సర్ ఫేజ్-2 ప్రక్రియ, పార్టీ అనుబంధ కమిటీల ఏర్పాటుపై విస్తృత చర్చ!

👉 హాజరైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ !

👉 దిశానిర్దేశం చేసిన ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ !

J SURENDER KUMAR,

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. సోమవారం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించారు.

యాదాద్రి భువనగిరి డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో పార్టీ సంస్థాగత పరిస్థితిని సమగ్రంగా సమీక్షిస్తున్నామని తెలిపారు.

👉 జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ నిర్మాణం, మండల స్థాయి వరకు పార్టీ విస్తరణ, గ్రామపంచాయతీ, బూత్ స్థాయిలో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు, పార్టీ సంస్థాగత వ్యవస్థకు మధ్య మెరుగైన సమన్వయం సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

👉 ఏఐసీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా గతంలో రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఉన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీని, ఇప్పుడు ప్రతి జిల్లాలోని సీనియర్ నాయకులతో ‘డిస్ట్రిక్ట్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ’గా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలను జోన్లుగా విభజించి క్షేత్రస్థాయిలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.

👉 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ అత్యంత కీలకమని, నిజమైన ఓటరు ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్షించాలని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు నమోదు అయ్యేలా చూసేందుకు బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు.

👉 గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పోరాడిన పాత నాయకులు, కార్యకర్తలకు రాబోయే రోజుల్లో ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలతో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్లలో పనిచేసిన నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.

👉 సర్ ప్రక్రియలో ఎక్కువ మంది అర్హులైన ఓటర్లను చేర్పించేందుకు కృషి చేసే కార్యకర్తలకు, సమర్థవంతంగా పనిచేసే బీఎల్ఏ- 2 ఏజెంట్లకు ప్రత్యేక ప్రాధాన్యత, ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

👉 సంస్థాగత నిర్మాణం, నామినేటెడ్ పదవుల భర్తీ, ఓటర్ల నమోదు ప్రక్రియపై చర్చించేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు స్పష్టం చేసిన ఆమె, సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు మరియు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

👉 పీఏసీ సమావేశంలో నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, యూత్ కాంగ్రెస్ , ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా విభాగాల జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.