👉 గాంధీభవన్‌లో ప్రజా సమస్యలకు వేదిక..
వినతుల స్వీకరించనున్న మంత్రి లక్ష్మణ్‌కుమార్ !
J.SURENDER KUMAR,
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టే దిశగా రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మరోసారి ప్రజలకు అందుబాటులోకి రానున్నారు.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో బుధవారం (ఆగస్టు 19) నిర్వహించనున్న ‘ప్రజలతో ముఖాముఖి’ కార్యక్రమానికి మంత్రి హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత సమస్యలపై వివరాలు తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలపై అధికారులతో సమన్వయం చేయనున్నారు.
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించిన సమస్యలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రికి వివరించి, వినతిపత్రాలు సమర్పించే అవకాశం ఉండటంతో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనలో భాగంగా నిర్వహిస్తున్న ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ వర్గాలు కోరాయి.
