👉 వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీకి లాంఛనంగా శ్రీకారం!
👉 వనదేవతల సన్నిధిలో సంక్షేమానికి శ్రీకారం !
J.SURENDER KUMAR,
వనదేవతలు సమ్మక్క–సారలమ్మల సన్నిధి వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి రాష్ట్ర సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మేడారం చేరుకున్న ముఖ్యమంత్రి సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులో భాగంగా వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు.

గిరిజన సంప్రదాయాల మధ్య ఘన స్వాగతం
ముఖ్యమంత్రి మేడారం చేరుకోగానే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ ,గిరిజన పూజారులు డోలు వాయిద్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

మొక్కులో భాగంగా వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటారు. వనదేవతల సన్నిధిలో సీఎం పూజలు నిర్వహించడం గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిపై ప్రభుత్వ గౌరవానికి ప్రతీకగా నిలిచింది.
👉 వితంతువులు, ఒంటరి మహిళలకు అండగా.!

సమ్మక్క–సారలమ్మ సన్నిధి నుంచే అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. స్థానికంగా అర్హులైన మహిళలకు పింఛన్లు అందజేసి, రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. సామాజికంగా, ఆర్థికంగా అండ అవసరమైన మహిళలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందనే సందేశాన్ని ఈ కార్యక్రమం ఇచ్చింది.
👉 భక్తులకు స్వచ్ఛమైన తాగునీరు !
మేడారానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
👉 మహిళా సంఘాలతో సీఎం ముచ్చట!

ఆలయ ప్రాంగణంలో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. మహిళా సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు, వారికి లభిస్తున్న ఉపాధి అవకాశాలు, ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు, భక్తులను వరుసగా కలుస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను సీఎం శ్రద్ధగా విన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, విప్ రామచంద్ర నాయక్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, నాయని రాజేందర్‌రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
