👉 భక్తులు, ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు..
👉 దోమలు, కుక్కలు, పశువుల సంచారంతో అధ్వాన పరిస్థితులు!
👉 తాగునీరు, వాష్‌రూమ్‌లు, ఫ్యాన్ల నిర్వహణపై ప్రయాణికుల ఆవేదన!
👉 బస్టాండ్‌లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్!
J.SURENDER KUMAR,
గోదావరి నది తీరాన ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ధర్మపురి బస్టాండ్ అపరిశుభ్రతకు ఆలవాలంగా మారింది. నిత్యం వేలాది మంది భక్తులు, ప్రయాణికులు, విద్యార్థులు రాకపోకలు సాగించే బస్టాండ్‌లో కనీస పరిశుభ్రత, మౌలిక వసతుల నిర్వహణపై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

బస్టాండ్ ప్రాంగణంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పశువుల సంచారం, మూత్రం, పేడతో దుర్వాసన వెదజల్లుతున్నది. ప్రయాణికులకు దోమలు, కుక్కల సంచారంతో బస్సుల కోసం వేచి ఉండే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బస్టాండ్‌కు వచ్చే భక్తులు, ముఖ్యంగా దూరప్రాంతాల నుంచి వచ్చే వారు కాసేపు ప్రశాంతంగా కూర్చునే పరిస్థితి కూడా లేకపోవడం బాధాకరం.
👉 బస్టాండ్‌లోనే బస్సు కోసం భయం..!

రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. ధర్మపురి నుంచి హైదరాబాద్‌కు రాత్రి 11 గంటల సమయంలో వెళ్లే బస్సు కోసం వేచి ఉండే ప్రయాణికులకు తగిన భద్రతా ఏర్పాట్లు కనిపించడం లేదు సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల గస్తీ వంటి చర్యలు ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు.
👉 మౌలిక వసతులపై ప్రశ్నలు..!

బస్టాండ్‌లో వాష్‌రూమ్‌లు, తాగునీటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా? ఉంటే వాటి నిర్వహణ ఎలా ఉందన్నది ప్రయాణికులకు స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పలు చోట్ల ఫ్యాన్లు పనిచేయకపోవడంతో వేచి ఉండే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
వివిధ డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు రోజుకు దాదాపు 100 ట్రిప్పుల వరకు రాకపోకలు సాగించే బస్టాండ్‌లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
👉‘ముక్కు మూసుకొని.. మౌనంగా వెళ్లాల్సిందే!’
ధర్మపురికి వచ్చే భక్తులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారని, అలాంటి వారికి బస్టాండ్ స్వాగతం పలకాల్సింది పోయి అపరిశుభ్రతతో ఇబ్బంది కలిగించడం సరికాదని స్థానికులు అంటున్నారు.
అలసిపోయి బస్సు కోసం కాసేపు కూర్చోవాలన్నా పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్టాండ్‌ను నిత్యం పరిశుభ్రంగా ఉంచి, తాగునీరు, వాష్‌రూమ్‌లు, ఫ్యాన్లు, భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని ప్రయాణికులు, స్థానికులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
