2022లో 75% రిజర్వేషన్లు 2026లో ఎందుకు లేవు ?

👉 గిరిజన ప్రాంతాల్లో పోలీస్ ఉద్యోగాలకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పించండి !

👉 2026 కానిస్టేబుల్‌ నియామకాల్లోనూ ప్రత్యేక నిబంధనలు కొనసాగించాలి !

👉 సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గిరిజన ఎమ్మెల్యేల వినతి !  


  J.SURENDER KUMAR,


గిరిజన ప్రాంతాల యువతకు పోలీస్‌ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు 2026 సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పోస్టుల్లో 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని 2022లో 75%.. రిజర్వేషన్లు ఉండగా 2026లో ఎందుకు లేవు ? అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు  గిరిజన ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, రామదాసు నాయక్‌, ఆది నారాయణ, పాయం వెంకటేశ్వర్లుతో కలిసి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి.. 75 శాతం రిజర్వేషన్‌ అంశంపై వినతిపత్రం సమర్పించారు.

👉 2022లో అమలైన విధానాన్నే కొనసాగించాలి
2022లో జరిగిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో గిరిజన ప్రాంతాలకు 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేసిన విషయాన్ని మంత్రి సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే 2026 నియామక నోటిఫికేషన్‌లో గిరిజన ప్రాంతాలకు సంబంధించిన పోస్టుల్లో ఈ రిజర్వేషన్‌ అమలు కాకపోవడంతో ఆయా ప్రాంతాల గిరిజన నిరుద్యోగ యువతలో ఆందోళన నెలకొందని వివరించారు.

👉 గిరిజన ప్రాంతాల యువతకు గతంలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. G.O.Ms.No.109, తేదీ 17.06.1988, అలాగే Gazette Notification No.49, తేదీ 10.05.2018లోని ప్రత్యేక నిబంధనలను పరిగణనలోకి తీసుకుని 2026 పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లోనూ 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కోరారు.

👉 అదే సమయంలో G.O.Ms.No.3, తేదీ 22.04.2020 ఆధారంగా 75 శాతం రిజర్వేషన్‌ అమలు చేయలేదని సంబంధిత అధికారుల ద్వారా తమ దృష్టికి వచ్చిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


👉 గిరిజన యువతకు న్యాయం చేయాలి !

పోలీస్‌ శాఖలో సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి గతంలో అమల్లో ఉన్న ప్రత్యేక నిబంధనలను సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల యువతకు రాజ్యాంగబద్ధంగా, గతంలో అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

👉 ఈ అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించి గిరిజన యువతకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తెలిపారు.