ధర్మపురి లోక్‌అదాలత్‌ లో అరుదైన ఘటన !

👉 ఇరుపక్షాల తల్లిదండ్రుల అంగీకారంతోదత్తత అవార్డు కు
న్యాయమూర్తి ఆమోదం..!

J. SURENDER KUMAR,

” వివాదాలకు రాజీ వేదికగా ఉండే లోక్‌అదాలత్‌లో.. ఓ కుటుంబానికి కొత్త బంధాన్ని కల్పించిన న్యాయస్థానం ”

***********

లోక్‌అదాలత్‌ అంటే సాధారణంగా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించే వేదిక. అయితే జగిత్యాల జిల్లా ధర్మపురి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో ఇందుకు భిన్నంగా ఓ అరుదైన దత్తత వ్యవహారం పరిష్కారమైంది. ఇరువర్గాల అంగీకారం మేరకు దత్తతకు సంబంధించిన కేసును పరిష్కరించి న్యాయమూర్తి దత్తత అవార్డు జారీ చేశారు.

👉 శనివారం ధర్మపురి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో మొత్తం 479 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో దత్తతకు సంబంధించిన కేసు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

👉 ఇరుపక్షాల సమ్మతి, అంగీకారంతో కేసును పరిష్కరించిన న్యాయమూర్తి వై. జానకి దత్తత అవార్డును జారీ చేశారు. ఈ కేసులో భాగ్య తిరుపతి దత్తత తీసుకునే వారిగా, లావణ్య (దివంగత రమేష్) దత్తత ఇచ్చే వారిగా పేర్కొంటూ అవార్డు జారీ చేశారు. అనంతరం న్యాయమూర్తి వై. జానకి సంబంధిత పక్షాలకు దత్తత అవార్డును అందజేశారు.

👉 ఈ సందర్భంగా న్యాయమూర్తి జానకి మాట్లాడుతూ..

లోక్‌అదాలత్‌ ద్వారా వివాదాలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాలకు సంతృప్తికరమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కేసు సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడంతో ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశారు.

సాధారణ వివాదాల పరిష్కారానికే పరిమితమయ్యే లోక్‌అదాలత్‌లో.. దత్తతకు సంబంధించిన వ్యవహారం ఇరువర్గాల ఏకాభిప్రాయంతో న్యాయస్థానం ద్వారా అవార్డు రూపంలో పరిష్కారం కావడం ధర్మపురి కోర్టులో ప్రత్యేకంగా నిలిచింది.

లోక అదాలత్ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బందేల రమేష్, ఉపాధ్యక్షులు మామిడాల శ్రీకాంత్, లోక్ అదాలత్ సభ్యులు గడ్డం సత్యనారాయణ రెడ్డి, రౌతు రాజేష్, ఏజీపీ ఇమ్మడి శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జాజాల రమేష్, న్యాయవాదులు అప్పాల నిరంజన్ సాంబరాజుల కార్తీక్, కస్తూరి శరత్ కుమార్, కలమడుగు కీర్తి ఇంచార్జి సూపర్ డెంట్ రేగుల చంద్రశేఖర్ పోలీస్ సిబ్బంది కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.