👉 నాడు రాజీనామా.. నేడు బర్తరఫ్..
👉 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు మంత్రి పదవికి దూరం!
J.SURENDER KUMAR,
రాజకీయాల్లో రాటు తేలిన నాయకురాలు.. నియోజకవర్గాల మార్పుల్లోనూ విజయాలను అందుకున్న నేత.. మంత్రిగా మాత్రం సుదీర్ఘకాలం కొనసాగలేకపోయారు. మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మంత్రి పదవికి సంబంధించిన రెండు కీలక పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పదవికి రాజీనామా చేసిన సురేఖ.. నేడు ప్రత్యేక తెలంగాణలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో “కొండా సురేఖకు మంత్రి పదవి అచ్చిరావడం లేదా?” అనే చర్చ మొదలైంది.
👉 2009లో తొలిసారి మంత్రి.. ఆ వెంటనే రాజీనామా!
కొండా సురేఖ 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్సార్ మరణం తర్వాత కె. రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే రోశయ్య మంత్రివర్గంలో కొనసాగేందుకు సురేఖ ఇష్టపడలేదు.
2009 అక్టోబర్‌లో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి రాజకీయ పరిణామాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పటి వార్తా కథనాలు పేర్కొన్నాయి.అలా మంత్రి అయిన కొద్ది నెలలకే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
👉 తెలంగాణలో మళ్లీ మంత్రి.. మూడేళ్లకే ముగిసిన ప్రస్థానం!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం కొనసాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆమె.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అటవీ, దేవాదాయ శాఖల బాధ్యతలు నిర్వహించారు.
అయితే కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా రాజకీయ వివాదాల నేపథ్యంలో ఆమె కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పార్టీ క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గవర్నర్‌కు సిఫారసు పంపగా, సెప్టెంబర్ 3, 2026న గవర్నర్ ఆమోదంతో ఆమె బర్తరఫ్ ప్రక్రియ పూర్తయింది.

👉 సెప్టెంబర్ 3తో మరోసారి తెరపడిన మంత్రి ప్రస్థానం!
ఇక్కడ మరో ఆసక్తికరమైన రాజకీయ యాదృచ్ఛికత కూడా చర్చకు వస్తోంది. 2009 సెప్టెంబర్ 3న వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం.. అదే పరిణామాల అనంతరం రోశయ్య ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత అక్టోబర్‌లో సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయడం.
2026 సెప్టెంబర్ 3న మాత్రం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం. అంటే.. సుమారు 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రెండుసార్లు మంత్రి పదవి దక్కినా.. రెండుసార్లూ ఆ పదవి మధ్యలోనే ముగిసింది.
👉 పార్టీ మారినా.. పోరాటం ఆగలేదు.. మంత్రి పదవి నిలవలేదు!
కొండా సురేఖకు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. బీసీ మహిళా నాయకురాలిగా తనకంటూ ప్రత్యేక రాజకీయ ముద్రను వేసుకున్నారు. అయితే ఆమె రాజకీయ ప్రస్థానాన్ని మంత్రి పదవుల కోణంలో చూస్తే మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
👉 గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి !

రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌భవన్‌లో గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్ తో పాటు పలువురు ఎంపీలు కూడా ఉన్నారు.
👉 నాడు రాజీనామా.. నేడు బర్తరఫ్..!

పదవి రెండుసార్లు దక్కింది.. కానీ రెండు సందర్భాల్లోనూ పూర్తికాలం కొనసాగలేదు.అందుకే తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఆసక్తికరమైన మాట ఒక్కటే—
“కొండా సురేఖకు ఎమ్మెల్యే పదవి అచ్చొచ్చింది.. మంత్రి పదవి మాత్రం ఎందుకు అచ్చిరాలేదో ?”
