ఒకే అసెంబ్లీలో హ్యాట్రిక్ కాదు…….

👉 ఒకే జిల్లాలో మూడు సీట్లు గెలిచిన .ఇద్దరి రాజకీయ చరిత్ర!

👉 తెలంగాణ రాజకీయాల్లో అరుదైన రికార్డు సృష్టించిన ఇద్దరు బిసి నాయకులు కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిలు !

J.SURENDER KUMAR,

సాధారణంగా ఒక రాజకీయ నాయకుడు తనకు బలమైన నియోజకవర్గాన్ని ఎంచుకుని వరుస విజయాలు సాధించడం చూస్తుంటాం. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి–పులివెందుల, నారా చంద్రబాబునాయుడు–కుప్పం, కేసీఆర్‌–గజ్వేల్, కేటీఆర్‌–సిరిసిల్ల, జీవన్‌రెడ్డి–జగిత్యాల, రేవంత్‌రెడ్డి–కొడంగల్ వంటి నేతలు తమ నియోజకవర్గాల్లో వరుస విజయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా.. మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటిన నేతలు తెలంగాణ రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తారు.
అలాంటి అరుదైన ఘనత సాధించిన ఇద్దరు బి.సి రాజకీయ నాయకులు, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిలు

👉 జిల్లాలో భిన్న నియోజకవర్గాల్లో ప్రజల మద్దతు పొందడం రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది.ఇది సాధారణ విజయం కాదు.. ప్రజల నమ్మకానికి నిదర్శనం!ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలవడం ఒక ఎత్తయితే.. వేర్వేరు నియోజకవర్గాల్లో పోటీ చేసి, మూడు ప్రాంతాల్లోనూ ప్రజల తీర్పును తనకు అనుకూలంగా మలుచుకోవడం మరో ఎత్తు.

👉 రాజకీయ పరిస్థితులు మారినా.. నియోజకవర్గాలు మారినా.. ప్రజల మధ్య బలమైన సంబంధాలు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాయకత్వంపై నమ్మకం ఉంటేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి.

👉 అందుకే.. ఒకే నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించిన నేతలతో పాటు, మూడు వేర్వేరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈ ఇద్దరు నాయకుల విజయ ప్రస్థానం కూడా తెలంగాణ రాజకీయ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గదే!

👉 ప్రజా జీవితంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..

పార్టీలు మారినా ప్రజలతో అనుబంధం.. నియోజకవర్గాలు మారినా విజయాలను అందుకోవడం.. ఈ ఇద్దరు నాయకుల రాజకీయ ప్రస్థానంలో ప్రత్యేకతగా నిలిచింది.

👉 ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. కొండా సురేఖ హవా!

మాజీ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన రాజకీయ విజయ ముద్ర వేశారు.

👉 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాయంపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


👉  2009లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.


👉 రాజకీయ పరిణామాల్లో భాగంగా బీఆర్‌ఎస్‌లో చేరిన ఆమె 2014లో వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

👉 2023లో వరంగల్ తూర్పు నుంచే గెలుపొంది, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
శాయంపేట నుంచి పరకాల.. పరకాల నుంచి వరంగల్ తూర్పు వరకు మూడు వేర్వేరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ప్రస్థానం కొండా సురేఖకు సొంతం.

👉 నిజామాబాద్ జిల్లాలో.. బాజిరెడ్డి విజయ పరంపర!

ఇదే తరహాలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1999లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు.

అనంతరం 2004లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు.


రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన 2014, 2018లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఛైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.


👉 నియోజకవర్గాలు మారినా.. గెలుపు బాట మాత్రం మారలేదు!


కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన అంశం స్పష్టమవుతుంది.
ఒకే నియోజకవర్గానికి పరిమితం కాకుండా.. ఒకే జిల్లాలోని మూడు వేర్వేరు అసెంబ్లీ స్థానాల్లో ప్రజల తీర్పును తమకు అనుకూలంగా మలుచుకున్నారు.


పార్టీలు, రాజకీయ సమీకరణాలు, నియోజకవర్గాలు మారినప్పటికీ ప్రజలతో ఉన్న అనుబంధమే తమ విజయాలకు బలంగా నిలిచిందని వారి రాజకీయ ప్రస్థానం చెబుతోంది.

ఒకే జిల్లాలో మూడు నియోజకవర్గాలు.. ఎమ్మెల్యేగా విజయాలు..
👉 ఉమ్మడి వరంగల్ – కొండా సురేఖ


➡️ శాయంపేట – 1999

➡️ పరకాల – 2009

➡️ వరంగల్ తూర్పు – 2014, 2023

👉 ఉమ్మడి నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి


➡️ ఆర్మూర్ – 1999

➡️ బాన్సువాడ – 2004

➡️ నిజామాబాద్ రూరల్ – 2014, 2018


ఇద్దరి ప్రస్థానంలో కామన్ పాయింట్ ఒక్కటే..

నియోజకవర్గం మారింది.. రాజకీయ పార్టీ మారింది.. కానీ ఎమ్మెల్యేగా గెలిచే సత్తా మాత్రం కొనసాగింది!
అందుకే.. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఒకే జిల్లాలోని మూడు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరుదైన నేతలుగా కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రత్యేకంగా నిలుస్తోంది.