ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి!

👉 అధికారం పోయినా అహంకారం పోలేదు !

👉 సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి  !


J .SURENDER KUMAR,


అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత నాలుగు రోజులు నుంచి స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యల వివాదం, బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచిత ప్రవర్తనపై రాజకీయంగా దుమారం చెలరేగింది. దీనిపై పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ వివాదం కొనసాగుతున్న వేళ గురువారం  సీఎం రేవంత్ రెడ్డి  సీఎల్పీ సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ,కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.


👉 బీఆర్ఎస్ కుట్రలను ఎలా తిప్పికొట్టాలో.. సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశంచేశారు.


ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని సభను నిర్వహిస్తున్నామన్నారు. 

👉 ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన సభను సజావుగా జరగకుండా కుట్ర చేశారని, అధికారం పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులను, ప్రజా ప్రతినిధులను దూషించిమూడు రోజులు సభను సజావుగా జరగకుండా చేశారని బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 

👉 ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు అధికారులపై అనుచితంగా వ్యవహరించడం, మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం చేశారని మండిపడ్డారు.

👉 శాసన సభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారన్నారు. నిరసన తెలిపేందుకు ఎస్సీ సెల్  కార్యక్రమం చేపడితే దళితులు నడిచిన నేలను శుద్ధి చేసి అవమానించారని సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

👉 ప్రతిపక్ష కుట్రను బలంగా తిప్పి కొట్టి, ప్రభుత్వంపై జరిగిన కుట్రను ప్రజలకు  తెలియజేసిన మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు.

👉 ఇటీవల జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టడం జరిగిందని తొందరలోనే నిజాలు బైటకు వస్తాయన్నారు.  సభ్యులంతా తప్పనిసరిగా సభలో చర్చల్లో పాల్గొనాలని,సభలో హాజరు శాతం తగ్గకుండా చూసుకోవాలన్నారు.

👉 ప్రజలు ఇచ్చిన హోదాను సరైన విధంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్ లో రాజకీయంగా రాణించలేరని దిశానిర్దేషం చేశారు. 

👉 అందరికీ వెసులుబాటుగా ఉండాలని అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి నిర్వహిస్తున్నామన్నారు. అసెంబ్లీలో సెంట్రల్ హాల్ ను ప్రారంభించుకుని దుద్దిళ్ల శ్రీపాదరావు  పేరు పెట్టుకున్నామని,  సభలో నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావించాలన్నారు.

👉 అసెంబ్లీ జరిగినన్ని రోజులు సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండాలని,  కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదిగి కాంగ్రెస్ కు నష్టం చేకూర్చాలని చూస్తున్నారని పలువురు నేతలపై ఫైర్ అయ్యారు.

👉 అసలు..  కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీత లక్ష్మా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి  రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? .. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 పోలీస్ సిబ్బందిలో కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కనిపించినట్టున్నారని,  అందుకే అంత ఆక్రోశంతో అధికారులపై దాడులు చేశారన్నారు.  దేశానికి మనం చేసిన జనగణన రోల్ మోడల్ అని, ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనతఅని చెప్పారు.

👉 తెలంగాణ నమూనాను జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. 

👉 ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు.  

👉 మీ ప్రతీ ప్రవర్తన రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుందని, మీ వ్యక్తిగత పనితీరు మీ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందన్నారు. SIR అంశాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 

👉 దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లు గా తేల్చారని, కానీ ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారన్నారు. దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని,  ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందన్నారు.

👉 1000 రోజుల పాలనకు సహకరించి నందుకు మీ అందరికీ ధన్యవాదాల చెబుతూ.. మీ సహకారం తో దేశం లో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకువచ్చమని సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ పై ప్రశంసలు కురిపించి కొత్త జోష్ ను నింపారు.