జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదం ఆదివాసీ ఆత్మగౌరవానికి ప్రతీక!

👉 కొమురం భీమ్ ఆశయాలను కొనసాగించాలి.!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

👉 జోడేఘాట్‌లో అమర యోధుడికి ఘన నివాళులు..!

👉 మంత్రి సీతక్కతో కలిసి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ కుమార్. !

J.SURENDER KUMAR,

జల్‌–జంగల్‌–జమీన్‌.. ఇది కేవలం ఒక నినాదం కాదు.. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి కోసం సాగిన మహోన్నత పోరాటానికి ప్రతీక  అడవి బిడ్డల హక్కుల కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన అమర యోధుడు కొమురం భీమ్ ఆశయాలను భావితరాలు కొనసాగించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ఆదివాసీ ఆరాధ్య దైవం, పోరాట యోధుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా సోమవారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని చారిత్రాత్మక జోడేఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని అమర వీరుడికి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి సీతక్కతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, గిరిజన నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

పోరాటమే ఊపిరిగా.. హక్కులే లక్ష్యంగా ..అడవి, భూమి, సహజ వనరులపై ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరిస్తూ, గిరిజన సమాజం ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.

👉 కొమురం భీమ్ జీవితం నేటి యువతకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, హక్కుల పట్ల అవగాహనను నేర్పుతుందని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్మరించుకోవడమే కాకుండా, వాటిని ఆచరణలో పెట్టడం ద్వారా ఆదివాసీ సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


👉 గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వ కట్టుబాటు
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం, గిరిజన హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.


👉 గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా వారి సమస్యలను పరిష్కరించేందుకు, హక్కులను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి ఫలాలు మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు సైతం చేరేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.


👉 అడవి బిడ్డల హక్కుల కోసం సాగిన పోరాటం చరిత్ర పుటల్లో ముగిసిపోయిన అధ్యాయం కాదు.. సమానత్వం, ఆత్మగౌరవం, న్యాయం కోసం నేటికీ మార్గదర్శకంగా నిలిచే స్ఫూర్తి కొమురం భీమ్‌ను స్మరించుకోవడం అంటే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడం మాత్రమే కాదు.. ఆయన కలలుగన్న హక్కుల పరిరక్షణ, గిరిజన సమాజ అభివృద్ధి, గౌరవప్రదమైన జీవనానికి కృషి చేయడం. అదే ఆ అమర యోధుడికి మనం అర్పించే నిజమైన నివాళి అని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు

👉 జోడేఘాట్ సాక్షిగా.. పోరాట స్ఫూర్తికి పునఃస్మరణ!

కొమురం భీమ్ వీరత్వానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచిన జోడేఘాట్ మరోసారి ఆదివాసీ ఆత్మగౌరవ నినాదంతో మార్మోగింది. వర్ధంతి సందర్భంగా అమర యోధుడికి నివాళులర్పించడం ద్వారా ఆయన పోరాటాన్ని, ఆదివాసీ సమాజ హక్కుల సాధనలో ఆయన పోషించిన చారిత్రాత్మక పాత్రను నేతలు స్మరించుకున్నారు.

జోడేఘాట్ వర్ధంతి సభలో  మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), ఖానాపూర్ ఎమ్మెల్యే  బొజ్జు,  ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవా లక్ష్మి, ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ  విఠల్,  తదితరులు పాల్గొని భీమ్ చిత్రపటానికి, స్మారక స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ₹ 180 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు.

👉 భారీ బందోబస్తు & ఉచిత రవాణా….!

దాదాపు 600 మంది పోలీసు సిబ్బందితో జోడేఘాట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. వేడుకలకు వచ్చే గిరిజనులు, సందర్శకుల కోసం హట్టి బేస్ క్యాంప్ నుండి జోడేఘాట్ వరకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది.

👉 విద్యాసంస్థలకు సెలవు….!

వర్ధంతి వేడుకల సందర్భంగా అక్టోబర్ 26న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు (రెసిడెన్షియల్ మినహా) జిల్లా కలెక్టర్ అధికారిక సెలవు ప్రకటించారు.