👉 అధికారులను ఆదేశించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ !
J.SURENDER KUMAR,
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులతో పాటు అష్టతీర్థాల ఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి, నిర్దేశించిన గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని సూచించారు.
గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆమె కాళేశ్వరంలో పర్యటించారు. ఈ సందర్భంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ప్రధాన ఆలయం, రామాలయం, జ్ఞానవాపి బావి, శుభానందిని అమ్మవారి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి పురోగతిని సమీక్షించారు. విజయ గణపతి ఆలయ నిర్మాణ ప్రాంతంలో కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు.
అనంతరం సరస్వతి ఘాట్‌ను సందర్శించి అష్టతీర్థాల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, భూసేకరణ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోట్ జెట్టీ ఏర్పాటు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ఆలయ పునర్నిర్మాణం, ఘాట్ల అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ……

కాళేశ్వరంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్నాయని, క్షేత్రస్థాయి పరిశీలనలో పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, మండపాల నిర్మాణ పనులు కూడా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. పనుల పురోగతికి కృషి చేస్తున్న ధార్మిక సలహాదారు, దేవాదాయ శాఖ కమిషనర్, కాంట్రాక్టర్లు, స్థపతులు, ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
👉 ప్రస్తుత పురోగతితో సంతృప్తి చెంది పనుల్లో వేగం తగ్గించరాదని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటే ప్రధాన ఆలయ నిర్మాణ పనులను మార్చి నాటికి పూర్తి చేయడం అత్యంత కీలకమని అన్నారు. అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, పనుల నాణ్యతలో రాజీ పడకుండా నిర్దేశిత గడువును తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

👉 అష్టతీర్థాల ఘాట్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి వేగవంతం చేయాలని శైలజా రామయ్యర్ సూచించారు. ఘాట్లకు సంబంధించిన ఫౌండేషన్ డ్రాయింగ్లను త్వరితగతిన అందించాలని, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలకు సంబంధించిన డిజైన్లను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. సివిల్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అవసరమైన యంత్రాలను అందుబాటులో ఉంచడంతో పాటు కార్మికుల సంఖ్యను పెంచాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
👉 ఆలయ నిర్మాణ పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహించాలని, జిల్లా కలెక్టర్ స్థాయిలోనూ నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. తాను ప్రతి నెలా క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తానని వెల్లడించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని సూచించారు.
👉 కాళేశ్వరాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పనులకు సంబంధించిన డిజైన్లు, ప్రణాళికలను త్వరగా ఖరారు చేయాలని సూచించారు. రహదారుల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పుష్కరాల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు.
👉 ఆలయ తలుపులు, ధ్వజస్తంభాలు, కలశాలకు బంగారు లేదా వెండి తాపడం చేయించేందుకు దాతలను గుర్తించి విరాళాలు సమీకరించాలని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మెరుగైన వసతులు కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
👉 దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ,

…
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ₹ 195 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. అష్టతీర్థాల ఘాట్లు, రహదారులు తదితర అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించామని, వివిధ శాఖల సమన్వయంతో పనులను పూర్తి చేసి గోదావరి పుష్కరాల నాటికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేస్తామని వెల్లడించారు.
👉 జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ…..
గోదావరి పుష్కరాల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. ఘాట్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 13 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, మరో 18 ఎకరాల భూసేకరణ కోసం సంబంధిత గ్రామాల ప్రజలతో చర్చించి, నిబంధనల ప్రకారం పరిహారం అందించే చర్యలు చేపడతామని వివరించారు. అవసరమైన డ్రాయింగ్లు అందిన వెంటనే ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, అన్ని శాఖల పనులు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధార్మిక సలహాదారు గోవింద హరి, సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, వివిధ శాఖల ఇంజినీరింగ్ అధికారులు, పర్యాటక శాఖ ప్రతినిధులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
