ఎస్సీ, ఎస్టీల  అభివృద్ధిపై అత్యవసర  సమావేశం!

👉 విదేశీ పర్యటన రద్దు చేసుకుని సమావేశంలో పాల్గొన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) ప్రత్యేక అభివృద్ధి కోసం అత్యవసర జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు తో కలిసి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.

గల్ఫ్ పర్యటనలో ఉన్న మంత్రి లక్ష్మణ్ కుమార్ కు, బుధవారం డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి  అంశంపై అత్యవసర సమావేశం గూర్చి సమాచారం ఇచ్చారు. వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని మంత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు.


👉 SC SDF మరియు ST SDF నిధుల కింద మొదటి మరియు రెండవ త్రైమాసికాల్లో చేసిన ఖర్చులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, సమావేశంలో పాల్గొన్న వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, మున్సిపల్ పరిపాలన మరియు పంచాయతీరాజ్ శాఖల అధికారులకు నిధుల వినియోగం, పనుల పురోగతి మరియు లక్ష్యాల సాధనపై మంత్రి లక్ష్మణ్ కుమార్   దిశానిర్దేశం చేశారు.

👉. ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’పై…!


తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు’పై కేబినెట్ సబ్ కమిటీ రెండవ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో సహచర మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఉన్నత విద్యాసంస్థలు మరియు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హక్కుల పరిరక్షణ, కులం లేదా సామాజిక నేపథ్యం ఆధారంగా ఎలాంటి వివక్షకు తావులేకుండా నివారించేందుకు సమగ్ర చట్టాన్ని తీసుకురావడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.


👉 ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై సమీక్ష

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ఖర్చులో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిధుల వినియోగాన్ని మరింత వేగవంతం చేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ వర్గాల సంక్షేమం, విద్య, గురుకులాల నిర్వహణ, స్కాలర్‌షిప్‌లు, స్టడీ సర్కిళ్లు మరియు స్వయం ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.