ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ చేపట్టాలి!

👉 తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత.. వచ్చే ఎనిమిది నెలల నీటి అవసరాలకు ఇప్పటి నుంచే ప్రణాళిక…!


👉 యాసంగిలో వరి సాగును ప్రోత్సహించవద్దు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలి…!


👉 మిషన్ భగీరథ ద్వారా వచ్చే జూన్ వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి…!


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…!

J.SURENDER KUMAR,

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎనిమిది నెలల నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …….

దైవ కృపతో జగిత్యాల జిల్లాలో తక్కువ నష్టాలతో 2026 ఖరీఫ్ సీజన్‌ను పూర్తి చేసుకునే పరిస్థితి ఉందని, ఇతర జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో వర్షపాతం లోటు కూడా తక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు. అయితే రానున్న ఎనిమిది నెలల్లో వర్షం పడకపోవచ్చనే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ), చెరువులు, ఇతర నీటి వనరుల్లో అందుబాటులో ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

👉 దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో పరిస్థితులు మరింత సమస్యాత్మకంగా ఉన్నాయని, జగిత్యాల జిల్లాలోనూ నీటి వినియోగంపై ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలను సాధ్యమైనంత వరకు కాపాడేందుకు మండల స్థాయి అధికారులు, వ్యవసాయ అధికారులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. అవసరమైతే పొరుగు రైతుల బోర్ల నుంచి నీటిని అందించే అవకాశాలను పరిశీలించి, రైతుల మధ్య సమన్వయం కల్పించాలని తెలిపారు.

👉 రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, రైతులు ఎదుర్కొనే సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని అన్నారు.

👉 యాసంగి పంటల ప్రణాళికను ప్రస్తుత నీటి లభ్యతకు అనుగుణంగా పూర్తిగా సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పీ నుంచి యాసంగి పంటలకు నీరు విడుదల చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తూ, బోరు నీరు అందుబాటులో ఉన్నా వరి సాగుకు వెళ్లవద్దని రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నీటి కొరత ఏర్పడితే పంటలను చివరి వరకు కాపాడటం కష్టమవుతుందని, అందువల్ల తక్కువ నీటితో, తక్కువ కాలంలో చేతికొచ్చే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.

👉 ప్రతి మండలంలో అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి, గ్రామాల వారీగా యాసంగి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని మంత్రి తెలిపారు. తాగునీరు, పశువుల నీటి అవసరాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే రోజుల్లో పెరిగే డిమాండ్‌కు అనుగుణంగా నీటి వనరులు, నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితిని మండలాల వారీగా అంచనా వేసి ప్రణాళికలను సవరించాలని ఆదేశించారు.

👉 స్ప్రింక్లర్ల కోసం రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వివరాలతో నివేదిక సమర్పించాలని, ఈ అంశాన్ని ప్రభుత్వంతో పాటు సంబంధిత మంత్రితో చర్చించి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన చోట నీటి సరఫరాపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఆఖేపల్లి ఆయకట్టు రైతుల ప్రస్తుత పంటలను రక్షించేందుకు ఒకసారి నీటిని విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

👉 ఉద్యాన పంటలు, కూరగాయల సాగును పెంచాలి..

ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు రైతులను ప్రోత్సహించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. కూరగాయలు, ఇతర ఉద్యాన పంటల సాగు ద్వారా రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోతుల సమస్య ఉన్న ప్రాంతాల్లో సౌర విద్యుత్‌తో పనిచేసే ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. సౌర ఫెన్సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తున్న విషయాన్ని రైతులకు వివరించాలని సూచించారు. ఆయిల్‌పామ్, కూరగాయల సాగును కూడా ప్రోత్సహించాలని ఆదేశించారు.

👉 భూగర్భ జలాలను పెంపొందించేందుకు VB-G RAM G పథకం ద్వారా అవసరమైన నీటి సంరక్షణ పనులు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, గ్రామాల్లో చిన్న సమస్య తలెత్తినా వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

సమావేశంలో జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎస్.వాణి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, (ఎంఆర్ఓలు), వ్యవసాయ అధికారులు (ఏఓలు), ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.