👉 జర్నలిస్టు కిడ్నాప్ ఘటనలో మరో కోణం..!
👉 1996- 97లో జగిత్యాలలో జర్నలిస్టు తన్నీరు సురేందర్ కిడ్నాప్..!
👉 రాష్ట్ర యూనియన్ నాయకుల జోక్యంతో క్షేమంగా బయటపడిన జర్నలిస్టు..!
👉 అధికారుల బదిలీకి ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ సమావేశంలో తీర్మానం..!
👉 అప్పటి పోలీసు అధికారులపై ప్రశ్నించిన నేటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.!
👉 విధి నిర్వహణలో క్రమశిక్షణ.. గతంలో వివాదాస్పద ఘటన..!
J.SURENDER KUMAR,
నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో పోలీసు అధికారిగా ప్రత్యేక గుర్తింపు పొందిన జగిత్యాల మాజీ ఏఎస్పీ, ఐపీఎస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం మృతి బాధాకరం. అనారోగ్య సమస్యలతో అమెరికాలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 8 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాల సమాచారం. ఆయన మరణవార్తతో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయనతో కలిసి పనిచేసిన అధికారులు, సిబ్బంది పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
అయితే, ఆయన పోలీసు అధికారిగా పనిచేసిన కాలంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కూడా ఇప్పుడు మరోసారి చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా 1996లో జగిత్యాల ఏఎస్పీగా పనిచేసిన సమయంలో ఓ జర్నలిస్టు కిడ్నాప్ ఘటన అప్పటి పాత్రికేయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒకవైపు పోలీసు అధికారిగా ఆయన సేవలను గుర్తుచేసుకుంటున్న తరుణంలో.. మరోవైపు జర్నలిస్టుల హక్కుల కోసం అప్పట్లో సాగిన పోరాటాన్ని కూడా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది.
👉 జర్నలిస్టు కిడ్నాప్.. కలకలం రేపిన ఘటన..!
1996లో జగిత్యాల ఏఎస్పీగా బాలసుబ్రహ్మణ్యం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర విధులు నిర్వహించారు. ఆ సమయంలో జగిత్యాల డివిజన్లోని సారంగాపూర్ ప్రాంతానికి చెందిన ఆంధ్రభూమి విలేకరి తన్నీరు సురేందర్‌ను పోలీసులు కిడ్నాప్ చేశారన్న ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టించాయి.
ప్రస్తుతం బీర్పూర్ మండల పరిధిలో ఉన్న కొలువాయి అటవీ గ్రామంలో నివసించిన తన్నీరు సురేందర్ అప్పట్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో.. జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద మరో జర్నలిస్టు పరమేశ్వర్ నిర్వహిస్తున్న ఎస్టీడీ బూత్ నుంచి హైదరాబాద్‌లోని యూనియన్ నాయకులు కే. శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్‌కు ఈ కిడ్నాప్ ఘటనపై సమాచారం అందించారు.
👉 రాష్ట్ర యూనియన్ నాయకుల జోక్యం జర్నలిస్టు క్షేమం..!
జర్నలిస్టు కిడ్నాప్ ఘటనను రాష్ట్ర యూనియన్ నాయకులు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జర్నలిస్టు ఆచూకీ కోసం ప్రయత్నాలు చేశారు.
ఆ సమయంలో తన్నీరు సురేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, ఆయన మావోయిస్టుల పత్రికా ప్రకటనలు చేరవేస్తున్నారన్న అనుమానంతో అర్బన్ నక్సలైట్‌గా భావించినట్లు పోలీసు వర్గాల కథనం.అయితే, జర్నలిస్టు కుటుంబ సభ్యులు, సహచరులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో యూనియన్ నాయకుల జోక్యం కీలకంగా మారింది.
రాష్ట్ర యూనియన్ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో మరుసటి రోజు తన్నీరు సురేందర్ తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
జర్నలిస్టు క్షేమంగా బయటపడటంతో అప్పట్లో యూనియన్ నాయకుల జోక్యం, సంఘటిత పోరాటం ప్రాధాన్యత సంతరించుకుంది.
👉 జెడ్పీ సమావేశంలో నిరసన.. అధికారుల బదిలీకి తీర్మానం..!
జర్నలిస్టులపై పోలీసుల వేధింపుల వ్యవహారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో చర్చకు వచ్చింది. అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్‌గా మాజీ మంత్రి రాజేశం గౌడ్ కొనసాగారు. జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ జర్నలిస్టు కిడ్నాప్ ఘటనపై సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసుల వ్యవహారశైలిపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేస్తూ.. సంబంధిత అధికారుల బదిలీకి తీర్మానం చేయాలని పట్టుబట్టారు.
జర్నలిస్టుల ఆందోళన, ప్రజాప్రతినిధుల ప్రశ్నల నేపథ్యంలో అధికారుల బదిలీకి జెడ్పీ సమావేశంలో తీర్మానం జరిగింది.
అనంతరం నాటి చంద్రబాబు ప్రభుత్వం కరీంనగర్ ఎస్పీ ఉమేష్ చంద్ర, జగిత్యాల ఏఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలను బదిలీ చేసింది.
👉 బదిలీల తర్వాత కూడా ఉద్రిక్తతలు..!
ఈ ఘటనకు సంబంధించిన పరిణామాలు కరీంనగర్ జిల్లాలో మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. నాటి జిల్లా పరిషత్ చైర్మన్ రాజేశం గౌడ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ధ్వంసం చేసిన ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ బస్టాండ్‌లోనూ వీరంగం సృష్టించారు.ఇదే తరహా ఉద్రిక్త పరిస్థితులు జగిత్యాల డివిజన్లో కొందరు జర్నలిస్టుల విషయంలోనూ ఏర్పడ్డాయి.
మరుసటి రోజు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరీంనగర్లో పర్యటించి ఘటనలపై విచారం వ్యక్తం చేస్తూ బాధితులను పరామర్శించారు. అప్పటి ఎస్పీ ఉమేష్ చంద్రను సస్పెండ్ చేస్తూ ప్రకటన వెలువడింది.
👉 పోలీసు అధికారిగా మరో కోణం..!
బాలసుబ్రహ్మణ్యం పోలీసు అధికారిగా విధులు నిర్వహించిన సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయనతో కలిసి పనిచేసిన వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి.

అక్రమ ఫైనాన్స్, అధిక వడ్డీ వ్యాపారాలు, ఇతర అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు చేపట్టడం.. మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచడం.. చట్టాన్ని కఠినంగా అమలు చేయడం వంటి అంశాల్లో ఆయన తనదైన ముద్ర వేసినట్లు చెబుతున్నారు. సామాన్య ప్రజలకు భద్రత కల్పించడంలో ఆయన పాత్ర ను గుర్తు చేసుకుంటున్నవారూ ఉన్నారు.
👉 వ్యక్తి మరణం.. చరిత్రలో నిలిచిన పోరాటం..!
బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేయడం మానవీయ బాధ్యత. అదే సమయంలో, ఆయన విధుల్లో ఉన్నప్పుడు చోటుచేసుకున్న ఘటనలను గుర్తుచేసుకోవడం చరిత్రను నమోదు చేయడంలో భాగం.
1996లో ఓ జర్నలిస్టు కిడ్నాప్ ఘటన.. రాష్ట్ర యూనియన్ నాయకుల జోక్యం.. జిల్లా పరిషత్ సమావేశంలో అధికారుల బదిలీకి తీర్మానం.. తదనంతర పరిణామాలు.. ఇవన్నీ అప్పటి పాత్రికేయ ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలుగా నిలిచాయి.
ఒక జర్నలిస్టుకు ఎదురైన సమస్యను వ్యక్తిగతంగా వదిలేయకుండా.. సంఘటిత పోరాటం ద్వారా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు యూనియన్ నాయకులు చేసిన కృషి ఈ ఘటనలో స్పష్టమైంది.
అధికారులు, వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోవచ్చు.. కానీ ప్రజాస్వామ్య హక్కుల కోసం సాగిన పోరాటాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. జర్నలిస్టుల ఐక్యతకు, సంఘటిత శక్తికి, ప్రశ్నించే గొంతుకల పరిరక్షణకు 1996లో జగిత్యాలలో జరిగిన ఈ ఘటన ఓ చారిత్రక గుర్తుగా నిలుస్తుంది.
