👉 రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలి
👉 పథకం అమలుకు అన్ని ఆసుపత్రులు తప్పనిసరిగా నమోదు కావాలి..
👉 ఈ-డీఏఆర్ పోర్టల్‌లో ప్రతి ప్రమాద కేసు నమోదు చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలి..!
👉 ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రమాద కేసుల ఆన్లైన్ నమోదు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి..!
👉 ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు !
J.SURENDER KUMAR,
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో వైద్య చికిత్స అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రమాద బాధితులకు చికిత్స ఖర్చుతో సంబంధం లేకుండా సమీపంలోని ఆసుపత్రుల్లో తక్షణ వైద్య సేవలు అందించాలని సూచించారు.
రోడ్డు ప్రమాద బాధితుల చికిత్స పథకం-2025 కింద పీఎం రాహత్ పథకం అమలు పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
👉 పీఎం రాహత్ పథకం అమలు విధానం, ఆసుపత్రుల్లో బాధితులకు వైద్య సేవలు అందించే ప్రక్రియ, ప్రమాద వివరాల నమోదు, క్లెయిమ్‌ల ఆమోదం, నిధుల విడుదల తదితర అంశాలను అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
👉 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ….
రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి వైద్య చికిత్స అందించడం అత్యంత కీలకమని తెలిపారు. గోల్డెన్ అవర్‌లో తగిన చికిత్స అందించడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రమాద బాధితులను చికిత్స ఖర్చుల గురించి ఆలోచించకుండా సమీపంలోని ప్రభుత్వ లేదా పథకం పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు.

👉 పీఎం రాహత్ పథకం కింద అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కొక్కరికి ₹1.50 లక్షల వరకు చికిత్స ఖర్చును నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ పథకం కింద చికిత్స పొందుతున్న ప్రమాద బాధితుల సంఖ్య తక్కువగా ఉందని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పథకం ప్రయోజనాలు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఆదేశించారు
👉 పీఎం రాహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఏటా సుమారు రూ.100 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ నిధులను ఆదా చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాద బాధితులకు మొదట పీఎం రాహత్ పథకం కింద నిర్దేశిత పరిమితి వరకు చికిత్స అందించాలని, ఆ పరిమితి దాటిన తర్వాత కూడా వైద్యపరంగా అవసరమైతే నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించి బాధితుల ప్రాణాలను కాపాడాలని సూచించారు.
👉పథకం అమలుకు అన్ని ఆసుపత్రులు నమోదు కావాలి
పీఎం రాహత్ పథకాన్ని అమలు చేసేందుకు జిల్లాల్లోని అన్ని ఆసుపత్రులు సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ పథకం అమలుకు అవసరమైన నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. నమోదైన ఆసుపత్రుల్లో ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అర్హులైన బాధితులకు పథకం ప్రయోజనాలు అందకుండా ఉండే పరిస్థితులు తలెత్తకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రభుత్వ, పథకం పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులు రోడ్డు ప్రమాద కేసులను నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన టీఎంఎస్ 2.0 పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఈ-డీఏఆర్ (eDAR) పోర్టల్‌లో ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువీకరణలు, ఆమోదాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
👉 ఈ-డీఏఆర్‌లో ప్రతి ప్రమాద కేసు నమోదు చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలి…!
ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు నమోదైన కేసులకు సంబంధించి ఆసుపత్రుల నుంచి వచ్చే ధ్రువీకరణ అభ్యర్థనలను పోలీసు అధికారులు వెంటనే పరిశీలించి ఈ-డీఏఆర్ పోర్టల్‌లో ఆమోదించాలని సీఎస్ స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రమాద కేసుల వివరాల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. ప్రమాద వివరాల నమోదు లేదా పోలీసు ధ్రువీకరణలో జాప్యం కారణంగా బాధితులకు చికిత్స అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని తెలిపారు.
👉ఆసుపత్రులు సమర్పించిన చికిత్స క్లెయిమ్‌లను సంబంధిత పోర్టల్‌లో పరిశీలించి ఆమోదించిన అనంతరం, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా ఆసుపత్రులకు నిధులు విడుదల చేసే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు టీఎంఎస్ యూఎంపీ పేయర్ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించి, నిబంధనల ప్రకారం అవసరమైన ఆమోదాలు అందించాలని సూచించారు.
👉 జిల్లా కలెక్టర్ బాధ్యతల మార్పిడి జరిగినప్పుడు పోర్టల్‌లో సంబంధిత అధికారి వివరాలు, జిల్లా అధికారిక ఈ-మెయిల్, మొబైల్ నంబర్లను వెంటనే నవీకరించాలని తెలిపారు. పథకం అమలులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ నియమించిన ఫిర్యాదుల పరిష్కార అధికారి ద్వారా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.
👉 రోడ్డు ప్రమాద ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలి.!
ప్రతి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాల్లో ప్రమాదాల వివరాలు, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, పెండింగ్ కేసులు, క్లెయిమ్‌ల ఆమోదం, ఆసుపత్రులకు నిధుల చెల్లింపులపై సమీక్షించాలని సూచించారు.
👉 జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారిని జిల్లా రోడ్డు భద్రతా కమిటీలో క్రియాశీల సభ్యుడిగా చేర్చి, ఈ-డీఏఆర్, పీఎం రాహత్ పోర్టళ్ల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సహకారం పొందాలని తెలిపారు. ఆరోగ్య, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, బాధితులకు చికిత్స పూర్తికాకముందే పథకానికి సంబంధించిన ప్రక్రియల కారణంగా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి చేసే పరిస్థితి రాకుండా చూడాలని స్పష్టం చేశారు.
👉 పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్ (NextGen mParivahan) మొబైల్ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఈ యాప్ ద్వారా రోడ్డు ప్రమాదాల సమాచారం అందించడం, క్లెయిమ్‌ల స్థితిని తెలుసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
👉 ప్రతి ప్రమాద కేసును పీఎం రాహత్ పథకం కింద నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో పీఎం రాహత్ పథకాన్ని తక్షణమే అమలులోకి తీసుకువచ్చి, ప్రమాద కేసులను ఈ పథకం కింద నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలో జరిగే ప్రతి రోడ్డు ప్రమాద కేసును నమోదు చేసి, అర్హులైన బాధితులకు పథకం ద్వారా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
👉 జిల్లాలోని ప్రతి ఆరోగ్యశ్రీ ఆసుపత్రి పీఎం రాహత్ పథకంలో వెంటనే నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల పూర్తి వివరాలను సేకరించి, సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వివరాలతో మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆసుపత్రులు, సంబంధిత పోలీసు అధికారుల మధ్య నిరంతర సంప్రదింపులు ఉండేలా చూడాలని, ప్రమాదం జరిగిన వెంటనే కేసు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేలా పర్యవేక్షించాలని తెలిపారు.
👉 జిల్లా ఆరోగ్యశ్రీ మేనేజర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తూ, అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల నమోదు, పోలీస్ స్టేషన్ అధికారుల వివరాల మ్యాపింగ్, ప్రమాద కేసుల ఆన్లైన్ నమోదు ప్రక్రియలను పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించి ఆసుపత్రి, పోలీసు శాఖలు వెంటనే స్పందించి అవసరమైన వివరాలను నమోదు చేయడంతో పాటు, ధ్రువీకరణలు, ఆమోదాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
👉 జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించేలా పోలీసు, వైద్య, రవాణా, రహదారులు మరియు భవనాల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పీఎం రాహత్ పథకం కింద నమోదైన కేసులు, బాధితులకు అందించిన చికిత్స, పెండింగ్ ఆమోదాలు, ఆసుపత్రులకు చెల్లించాల్సిన నిధులపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.
👉 అర్హులైన ప్రతి ప్రమాద బాధితుడికి పథకం ప్రయోజనాలు అందేలా చూడాలని, ఆసుపత్రుల నమోదు లేదా పరిపాలనా ప్రక్రియల కారణంగా అత్యవసర వైద్య చికిత్సలో ఎలాంటి జాప్యం జరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా సుజాత, ఆర్&బీ ఈఈ, జిల్లా రవాణా అధికారి సందాని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
