పుష్కర పనులు యుద్ధ ప్రాతిపదికన చేయాలి కమిషనర్!

👉 కాళేశ్వరంలో పుష్కరఘాట్ల అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ హనుమంతరావు.!


J.SURENDER KUMAR,

గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరంలో పుష్కరఘాట్ల అభివృద్ధి పనులతో పాటు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాళేశ్వరం క్షేత్రంలో పర్యటించిన కమిషనర్ దేవాదాయ, నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

👉 ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ...

చేపట్టిన అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నిర్మాణ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న నిర్మాణ పనులను కమిషనర్ ప్రత్యేకంగా పరిశీలించారు. అన్ని నిర్మాణ పనులను సమాంతరంగా చేపట్టి, అవసరమైనంత మంది కార్మికులను నియమించి షిఫ్టుల వారీగా పనులు నిర్వహించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

👉 అక్షరాభ్యాస మండపం, అద్దాల మండపం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.ఆలయ పునర్నిర్మాణాన్ని రూపొందించిన ప్రణాళికకు, సంప్రదాయ వాస్తు నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి మార్పులు, వ్యత్యాసాలు చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

👉 నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కాంక్రీట్ పనుల్లో వైబ్రేటర్లను వినియోగించాలని, గోనె సంచులు, వరి గడ్డితో తగిన విధంగా వాటర్ క్యూరింగ్ చేపట్టాలని సూచించారు. ప్రతి నిర్మాణ పనిని సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి పటిష్ఠంగా పూర్తి చేయాలన్నారు.

👉 వచ్చే నెల 4వ తేదీన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కాళేశ్వరం పర్యటనకు రానున్న నేపథ్యంలో అప్పటిలోగా పనుల్లో గణనీయమైన పురోగతి సాధించాలని, నిర్మాణాలు స్పష్టమైన రూపు సంతరించుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

👉 గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తాగునీరు, రహదారులు, పార్కింగ్, వీఐపీ ఘాట్లు తదితర మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలన్నారు. గత పుష్కరాల సందర్భంగా ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని తెలిపారు.

👉 పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన ప్రాంతాల్లో వాచ్ టవర్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పుష్కరఘాట్లకు ఇరువైపులా ర్యాంపుల నిర్మాణం చేపట్టాలని, గోదావరిలో పుష్కర స్నానాలు ఆచరించే భక్తుల భద్రతకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు.

👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ….
కాళేశ్వరంలో ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

ఈ పర్యటనలో కాటారం సబ్ కలెక్టర్ సౌరవ్ శర్మ, దేవాదాయ, నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.